సౌత్ ​ఆఫ్రికాలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేసింది

సౌత్ ​ఆఫ్రికాలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేసింది

కేప్​టౌన్: ఒమిక్రాన్ వేరియంట్​ బయటపడిన సౌత్ ​ఆఫ్రికాలో ఫోర్త్ వేవ్ ఎంటరైందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మొత్తం తొమ్మిది ప్రావిన్సులుండగా.. ఏడింటిలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని హెల్త్ మినిస్టర్ వో ఫాహ్లా శుక్రవారం తెలిపారు. సాధ్యమైనంత మేరకు మరణాలు జరగకుండా వైరస్​ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన మీడియాతో చెప్పారు. క్రిస్మస్ పండుగ రానున్నందుకు పూర్తి లాక్​డౌన్ ను అమలు చేయబోమని, దేశంలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటామని ఫాహ్లా ప్రకటించారు. సౌత్​ ఆఫ్రికాలో గురువారం ఒకే రోజు 11,500, అంతకుముందు రోజు 8,500 కరోనా కేసులు ఫైల్ అయ్యాయి.

రంగంలోకి డబ్ల్యూహెచ్​వో
రోజురోజుకూ సౌత్​ ఆఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్​వో) ఎక్స్​పర్ట్  టీమ్​ను శుక్రవారం ఆ దేశానికి పంపించింది. ఒమిక్రాన్​కు కేంద్రంగా ఉన్న గౌటెంట్ ప్రావిన్స్ కు వెళ్లిన ఈ టీమ్... వైరస్​ వ్యాప్తి, చూపిస్తున్న ప్రభావం, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై రీసెర్చ్ చేస్తుందని డబ్ల్యూహెచ్​వో అధికారులు తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్​పై ఇప్పటికే తమ బృందం ఒకటి సౌత్​ ఆఫ్రికాలో పనిచేస్తోందని చెప్పారు.