IND vs SA: టీమిండియాకు టెన్షన్ టెన్షన్.. 400 పరుగులకు చేరువలో సౌతాఫ్రికా ఆధిక్యం

IND vs SA: టీమిండియాకు టెన్షన్ టెన్షన్.. 400 పరుగులకు చేరువలో సౌతాఫ్రికా ఆధిక్యం

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు టెన్షన్ మొదలయింది. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో సఫారీల  ఆధిక్యం రెండో ఇన్నింగ్స్ లో 400 పరుగులకు చేరువైంది. నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా మూడు వికెట్లు తీసినా ప్రత్యర్థి ఆధిక్యం 400 రన్స్ కు చేరువలో ఉండడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం కష్టంగానే కనిపిస్తుంది. నాలుగో రోజు టీ విరామానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజ్ లో ట్రిస్టన్ స్టబ్స్ (14), టోనీ డి జోర్జీ (21) ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 395 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

వికెట్ నష్టపోకుండా 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్ లో 81 పరుగులు రాబట్టింద. తొలి సెషన్ ఆరంభంలో సౌతాఫ్రికా ఓపెనర్లు మార్కరం, రికెల్ టన్ జాగ్రత్తగా ఆడారు. ఓపిగ్గా ఆడుతూ ఈ సిరీస్ లో మరోసారి జట్టుకు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 59 పరుగులు జోడించారు. ఎట్టకేలకు వీరి జోడీని జడేజా విడగొట్టాడు. జడేజా బౌలింగ్ లో సిరాజ్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కు రికెల్ టన్ ఔట్ కావడంతో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. కాసేపటికే మార్కరం (29)తో పాటు కెప్టెన్ బవుమా (3) కూడా ఔట్ కావడంతో సౌతాఫ్రికా 77 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. 

మార్కరంను ఒక స్టన్నింగ్ డెలివరీతో జడేజా క్లీన్ బౌల్డ్ చేస్తే.. బవుమాను సుందర్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో సౌతాఫ్రికా జట్టును ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జీ ముందుకు తీసుకెళ్లారు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంటూ టీ విరామం వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీసుకున్నాడు. సుందర్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 489 పరుగులు చేస్తే.. ఇండియా 201 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్ లో 288 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది.