IND vs SA: ఒకే రోజు 16 వికెట్లు: సౌతాఫ్రికాను తిప్పేసిన జడేజా.. కోల్‌‌‌‌కతా టెస్టులో విజయం దిశగా టీమిండియా

IND vs SA: ఒకే రోజు 16 వికెట్లు: సౌతాఫ్రికాను తిప్పేసిన జడేజా.. కోల్‌‌‌‌కతా టెస్టులో విజయం దిశగా టీమిండియా

కోల్‌‌‌‌కతా వేదికగా ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు వికెట్ల వర్షం కురిసింది. శనివారం (నవంబర్ 15) ఒక్క రోజే ఏకంగా 16 వికెట్లు కూలడంతో మ్యాచ్ మూడో రోజే ఫలితం రానుంది. మొదట సౌతాఫ్రికా రెచ్చిపోయి టీమిండియాను 189 పరుగులకు ఆలౌట్ చేస్తే.. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు అంతకుమించి అన్నట్టుగా వికెట్ల వర్షం కురిపించి గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. రెండో రోజు అట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ బవుమా (29), కార్బిన్ బాష్ (1) ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

టీమిండియాను కేవలం 189 పరుగులకే ఆలౌట్ చేసి ఫుల్ జోష్ లో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు ఎదరు దెబ్బలు తగిలాయి. టీ విరామానికి ముందే కుల్దీప్ యాదవ్ సఫారీ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (11) ను ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ చేశాడు. టీ విరామం తర్వాత తొలి ఓవర్ లోనే మార్కరం (4)ను జడేజా పెవిలియన్ కు పంపడంతో 25 పరుగులకే సౌతాఫ్రికా తమ ఓపెనర్లను కోల్పోయింది. ఇదే ఊపును కొనసాగించిన జడేజా వరుస విరామాల్లో వియాన్ ముల్డర్ (11), టోనీ డి జోర్జీ (2), ట్రిస్టన్ స్టబ్స్ (5) లను ఔట్ చేయడంతో సగం జట్టును కోల్పోయిన సౌతాఫ్రికాను కష్టాల్లో పడింది.  

60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను ఒక ఎండ్ లో బవుమా పోరాడినా మిగిలిన వారు ఎవరూ సహకరించలేదు. అక్షర్ పటేల్ వికెట్ కీపర్ కైల్ వెర్రెయిన్ (9)ను ఔట్ చేస్తే.. మార్కో జాన్సెన్ (13)ను ఆట చివర్లో కుల్దీప్ పెవిలియన్ కు చేర్చాడు. ప్రస్తుతం 29 పరుగులతో బవుమా పోరాడుతున్నాడు. ఇండియా బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ రెండు.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు. బవుమా మూడో రోజు చివరి మూడు వికెట్లతో ఎలా పోరాడతాడనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. 

తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. సఫారీ బౌలర్ల ధాటికి  మన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. శనివారం (నవంబర్ 15) రెండో రోజు ఆటలో బ్యాటింగ్ లో చేతులెత్తేయడంతో తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు కేవలం 30 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. 39 పరుగులు చేసిన రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సుందర్ (29), పంత్ (27), జడేజా (27) వచ్చిన మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ నాలుగు.. జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. హార్మర్,కార్బిన్ బాష్ లకు చెరో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 159 పరుగులకు ఆలౌటైంది.