ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇరు జట్లు తమ ప్లేయింగ్ 11 లో కీలక మార్పు చేశారు. ఇండియా తమ ప్లేయింగ్ 11లో స్పిన్నర్ అక్షర్ ను పక్కన పెట్టి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. తొలి టెస్టులో నలుగురు స్పిన్నర్లతో ఆడిన ఇండియా రెండో టెస్టులో ఆ అవసరం లేదని భావిచి ఒక స్పిన్నర్ ను తగ్గించి నితీష్ ను తుది జట్టులోకి తీసుకొని వచ్చింది. మరోవైపు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కార్బిన్ బాష్ ను తప్పించి స్పిన్నర్ ముత్తుస్వామిని ప్లేయింగ్ 11లోకి తీసుకొని వచ్చారు.
ఆసక్తికరంగా సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో ఒకే స్పెషలిస్ట్ పేస్ బౌలర్ తో బరిలోకి దిగుతోంది. మార్కో జాన్సెన్ ఒక్కడే ఆ సౌతాఫ్రికా జట్టులో స్పెషలిస్ట్ పేసర్. ఆల్ రౌండర్ ముల్డర్ జాన్సెన్ తో పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. మహరాజ్, ముత్తుస్వామి, హార్మర్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లతో సఫారీలు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సౌతాఫ్రికా తొలి టెస్ట్ గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్లు ప్లేయింగ్ 11లో చేసిన మార్పులు విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆసక్తి నెలకొంది.
సొంతగడ్డపై టెస్టుల్లో మన జట్టుకు తిరుగులేదు. ఇది ఒకప్పటి మాట. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 0–3తో చిత్తయిన ఇండియా కంచుకోటకు బీటలు వారగా ఇప్పుడు మరో వైట్‌వాష్ గండం వెంటాడుతోంది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లేకుండానే శనివారం (నవంబర్ 22) రెండో టెస్టులో సవాల్‌కు రెడీ అయింది. ఈశాన్య రాష్ట్రం అసోంలోని గువాహటి తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుండగా ఇందులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను పంచుకోవాలని పట్టుదలగా ఉంది.
కోల్‌కతా తొలి టెస్టులో దెబ్బతిన్న ఇండియా ఇప్పుడు స్టాండిన్ కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో ఈ అగ్ని పరీక్షలో నెగ్గి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు తొలి మ్యాచ్ గెలిచిన జోరుతో గువాహటిలోనూ ఆతిథ్య జట్టును పడగొట్టి 2–0తో సిరీస్ సొంతం చేసుకోవాలని సఫారీలు ఉవిళ్లూరుతున్నారు.
