గువాహటి: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇండియా బౌలర్లు ఘోరంగా తేలిపోయారు. దాంతో లోయర్ ఆర్డర్‌లో సెనురాన్ ముత్తుసామి (206 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109), మార్కో యాన్సెన్ (91 బాల్స్‌లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93) దుమ్మురేపడంతో.. ఆదివారం రెండో రోజు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 151.1 ఓవర్లలో 489 రన్స్‌కు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6.1 ఓవర్లలో 9/0 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (7 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా 480 రన్స్ వెనకబడి ఉంది.
4 వికెట్లు తీయలేక..
247/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికాను ఇండియా బౌలర్లు ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. లోయర్ ఆర్డర్‌లో నాలుగు వికెట్లు తీయలేక భారీ స్కోరు సమర్పించుకున్నారు. డే స్టార్టింగ్ నుంచే ఓవర్‌నైట్ బ్యాటర్ సెనురాన్ ముత్తుసామి, కైల్ వెరెన్ (45) సూపర్‌గా ఆడారు. మార్నింగ్ సెషన్‌లో బుమ్రా (2/75), సిరాజ్ (2/106) ప్రభావం చూపలేకపోయారు.
జడేజా (2/94), సుందర్, కుల్దీప్ బాల్‌ను టర్న్ చేసినా రన్స్‌ను అడ్డుకోలేకపోయారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వెరెన్, ముత్తుసామి భారీ షాట్లు ఆడారు. ఈ క్రమంలో జడేజా బౌలింగ్‌లో ఎల్బీ అయిన ముత్తుసామి డీఆర్‌ఎస్‌లో బయటపడ్డాడు. టీవీ రీప్లేలో బాల్ గ్లోవ్స్‌ను తాకినట్లు తేలింది. 121 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఫలితంగా 316/6 స్కోరుతో సౌతాఫ్రికా టీ బ్రేక్‌కు వెళ్లింది.
యాన్సెన్ జోరు..
రెండో సెషన్‌లోనూ సౌతాఫ్రికా బ్యాటర్లదే జోరు కనిపించింది. ముఖ్యంగా సిరాజ్ రివర్స్ స్వింగ్‌ను రాబట్టడంలో ఫెయిలయ్యాడు. ఎక్కువగా బౌన్సర్లకు మొగ్గడంతో ముత్తుసామి బ్యాట్ ఝుళిపించాడు. ఫ్రంట్ ఫుట్‌లో ఆడుతూ స్ట్రయిట్ బౌండ్రీలు రాబట్టాడు. కుల్దీప్‌ను టార్గెట్ చేసి లాంగాన్‌లో సిక్సర్లు కొట్టాడు. చివరకు ఇన్నింగ్స్ 121వ ఓవర్‌లో జడేజా వేసిన వైడ్ బాల్‌ను ముందుకొచ్చి ఆడే క్రమంలో వెరెన్ స్టంపౌటయ్యాడు. దాంతో ఏడో వికెట్‌కు 88 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
ఈ దశలో వచ్చిన యాన్సెన్ టీ20 మ్యాచ్ ఆడాడు. ఇండియా బౌలర్లందర్ని టార్గెట్ చేసి లాంగాన్, లాంగాఫ్, మిడాన్‌లో భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 53 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌లో అండగా నిలిచిన ముత్తుసామి 192 బాల్స్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇద్దరి జోరుతో సౌతాఫ్రికా 428/7తో లంచ్‌కు వెళ్లింది.
అయితే మూడో సెషన్ ఆరంభంలోనే ప్రొటీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సెషన్ రెండో ఓవర్‌లోనే సిరాజ్ వేసిన బంపర్‌కు ముత్తుసామి ఫైన్ లెగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఎనిమిదో వికెట్‌కు 97 రన్స్ జతయ్యాయి. కొద్దిసేపటికే హార్మర్ (5) ఔటైనా యాన్సెన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హార్మర్‌తో తొమ్మిదో వికెట్‌కు 31, కేశవ్ మహారాజ్ (12 నాటౌట్)తో పదో వికెట్‌కు 27 రన్స్ జోడించి భారీ స్కోరు అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 151.1 ఓవర్లలో 489 ఆలౌట్ (ముత్తుసామి 109, యాన్సెన్ 93, కుల్దీప్ 4/115), ఇండియా తొలి ఇన్నింగ్స్: 6.1 ఓవర్లలో 9/0 (జైస్వాల్ 7 బ్యాటింగ్, రాహుల్ 2 బ్యాటింగ్).
