V6 News

IND vs SA: చండీఘర్‌లో డికాక్ సూపర్ షో.. టీమిండియాను టెన్షన్ పెడుతున్న బిగ్ టార్గెట్

IND vs SA: చండీఘర్‌లో డికాక్ సూపర్ షో.. టీమిండియాను టెన్షన్ పెడుతున్న బిగ్ టార్గెట్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. గురువారం (డిసెంబర్ 11) చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి తప్పితే ప్రతి ఒక్కరు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మరోవైపు సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్ 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేయడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. డికాక్ (90) టాప్ స్కోరర్ గా నిలిస్తే.. మార్కరం (29) పర్వాలేదనిపించాడు. మిల్లర్ (20), ఫెరీరా (30) చివర్లో మెరుపులు నేర్పించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.  

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభంలో ఇన్నింగ్స్ ను నిదానంగా ఆరంభించింది. తొలి రెండు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. మూడో ఓవర్ నుంచి డికాక్ చెలరేగి ఆడాడు. తర్వాత రెండు ఓవర్లలో 28 పరుగులు రాబట్టారు. ఐదో ఓవర్లో ఓపెనర్ హెన్డ్రిక్స్ (8)ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేయడంతో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో మార్కరంతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఒక ఎండ్ లో మార్కరం నిదానంగా ఆడినా.. మరో ఎండ్ లో డికాక్ అదే పనిగా చెలరేగాడు. ఓవర్లో కనీసం ఒక బౌండరీ కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్ కు 83 పరుగులు జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. 

వరుణ్ చక్రవర్తి వేసిన 12 ఓవర్లో రెండు సిక్సర్లు బాది గేర్ మార్చిన మార్కరం (29) అదే ఓవర్లో చివరి బంతికి ఔటయ్యాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా డికాక్ విధ్వంసం ఆగలేదు. బౌండరీలతో హోరెత్తిస్తూ 90 పరుగులకు చేరుకున్నాడు. సెంచరీ ఖాయమనుకుంటే 16 ఓవర్ తొలి బంతికి ఊహించని రీతిలో రనౌటయ్యాడు. ఆ తర్వాత బ్రేవీస్ (14) కూడా ఔట్ కావడంతో సఫారీల ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. చివర్లో మిల్లర్, ఫెరీర్ మెరుపులు నేర్పించడంతో సౌతాఫ్రికా స్కోర్ 200 పరుగులకు చేరుకుంది. తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేసిన సౌతాఫ్రికా చివరి 10 ఓవర్లలో 123 పరుగులు రాబట్టింది.