IND vs SA: సౌతాఫ్రికా సంచలన విజయం.. 124 పరుగులను ఛేజ్ చేయలేక ఘోరంగా ఓడిన టీమిండియా

IND vs SA: సౌతాఫ్రికా సంచలన విజయం.. 124 పరుగులను ఛేజ్ చేయలేక ఘోరంగా ఓడిన టీమిండియా

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోరంగా ఓడింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక కుప్పకూలింది. సఫారీ బౌలర్ల ధాటికి 124 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక 93 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్‎కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో ముగిసిన ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాషింగ్ టన్ సుందర్ (31), అక్షర్ పటేల్ (26) పోరాటం జట్టు విజయానికి సరిపోలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ నాలుగు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. జాన్సెన్, మహరాజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.   

2 వికెట్ల నష్టానికి 10 పరుగులతో మూడో రోజు రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా ఈ సెషన్ లో 64 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. సెషన్ ఆరంభంలో సుందర్, జురెల్ తమ పట్టుదల చూపించారు. జాగ్రత్తగా ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 32 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించిన తర్వాత వీరి జోడీని హార్మర్ విడగొట్టాడు. జురెల్ ను ఔట్ చేసి బిగ్ బ్రేక్ ఇచ్చాడు. ఇదే ఊపులో హార్మర్ పంత్ ని ఔట్ చేసి టీమిండియాను టెన్షన్ లోకి నెట్టాడు. ఈ దశలో సుందర్, జడేజా సఫారీ బౌలర్లను కాస్త ప్రతిఘటించారు. 26 పరుగులు జోడించి జట్టు విజయంపై ఆశలు పెంచారు.

టీ విరామానికి ముందు జడేజా, సుందర్, కుల్దీప్ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో మ్యాచ్ సౌతాఫ్రికా చేతుల్లోకి వెళ్ళింది. మహరాజ్ ఓవర్లో అక్షర్ రెండు సిక్సర్లు.. ఒక ఫోర్ కొట్టి విజయంపై ఆశలు రేకెత్తించినా ఆ తర్వాత బంతికే ఔటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా సంచలన విజయాన్ని నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులతో మూడో రోజు అట ప్రారంభించిన సౌతాఫ్రికా బవుమా (55) పోరాటంతో 60 పరుగులు జోడించి 153 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 159 పరుగులు చేస్తే.. ఇండియా 189 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ నవంబర్ 22న జరుగుతుంది.