సౌతాఫ్రికాపై రెండో టీ20లో టీమిండియా ఓడిపోయింది. గురువారం (డిసెంబర్ 11) చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో ముగిసిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైన టీమిండియాకు పరాభవం తప్పలేదు. మరోవైపు సౌతాఫ్రికా ఆల్ రౌండ్ షో తో అదరగొట్టి 51 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. డికాక్ (90) బ్యాటింగ్ లో చెలరేగితే.. బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించి సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించారు.
214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఘోరమైన ఆరంభం లభించింది. తొలి ఓవర్ ఐదో బంతికే గిల్ వికెట్ ను కోల్పోయింది. పేలవ ఫామ్ లో ఉన్న గిల్ ఆడిన తొలి బంతికే డకౌటయ్యాడు. కాసేపటికే 17 పరుగులు చేసిన అభిషేక్ శర్మతో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 5 పరుగులు చేసి నిరాశపర్చడంతో భారత జట్టు 32 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో తిలక్ వర్మ, అక్షర్ పటేల్ కలిసి భారత జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్ కు 35 పరుగులు జోడించి వికెట్ల పతనాన్ని ఆపారు.
వికెట్ కాపాడుకునే ప్రయత్నంలో భారత జట్టుకు పరుగులు రాలేదు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన అక్షర్ పటేల్ 21 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆడుకుంటాడనుకున్న హార్దిక్ పాండ్య పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. 23 బంతుల్లో 20 పరుగులే చేసి ఔటయ్యాడు. పాండ్య ఔట్ కావడంతో టీమిండియా ఓటమి కన్ఫర్మ్ అయింది. అయితే ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో తిలక్ వర్మ (62) పోరాడుతూ వచ్చాడు. చివర్లో జితేష్ శర్మతో కలిసి బౌండరీల వర్షం కురిపించాడు.
ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ హైదరాబాదీ ఇండియాను గెలిపించడానికి విశ్వప్రయత్నం చేశాడు. అయితే చేయాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో పరాజయం తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో బార్ట్ మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. సిపమాల, మార్కో జాన్సెన్, ఎంగిడి తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
సౌతాఫ్రికా భారీ స్కోర్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభంలో ఇన్నింగ్స్ ను నిదానంగా ఆరంభించింది. తొలి రెండు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. మూడో ఓవర్ నుంచి డికాక్ చెలరేగి ఆడాడు. తర్వాత రెండు ఓవర్లలో 28 పరుగులు రాబట్టారు. ఐదో ఓవర్లో ఓపెనర్ హెన్డ్రిక్స్ (8)ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేయడంతో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో మార్కరంతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఒక ఎండ్ లో మార్కరం నిదానంగా ఆడినా.. మరో ఎండ్ లో డికాక్ అదే పనిగా చెలరేగాడు. ఓవర్లో కనీసం ఒక బౌండరీ కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్ కు 83 పరుగులు జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు.
వరుణ్ చక్రవర్తి వేసిన 12 ఓవర్లో రెండు సిక్సర్లు బాది గేర్ మార్చిన మార్కరం (29) అదే ఓవర్లో చివరి బంతికి ఔటయ్యాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా డికాక్ విధ్వంసం ఆగలేదు. బౌండరీలతో హోరెత్తిస్తూ 90 పరుగులకు చేరుకున్నాడు. సెంచరీ ఖాయమనుకుంటే 16 ఓవర్ తొలి బంతికి ఊహించని రీతిలో రనౌటయ్యాడు. ఆ తర్వాత బ్రేవీస్ (14) కూడా ఔట్ కావడంతో సఫారీల ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. చివర్లో మిల్లర్, ఫెరీర్ మెరుపులు నేర్పించడంతో సౌతాఫ్రికా స్కోర్ 200 పరుగులకు చేరుకుంది. తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేసిన సౌతాఫ్రికా చివరి 10 ఓవర్లలో 123 పరుగులు రాబట్టింది.
South Africa level things up with a thumping win 👊 https://t.co/uXWZaLCQy5 | #INDVSA pic.twitter.com/LaeEVF1p2g
— ESPNcricinfo (@ESPNcricinfo) December 11, 2025

