సఫారీలదే వన్డే సిరీస్‌‌‌‌..రెండో వన్డేలో గ్రాండ్ విక్టరీ

సఫారీలదే వన్డే సిరీస్‌‌‌‌..రెండో వన్డేలో గ్రాండ్ విక్టరీ

లండన్‌‌‌‌: అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆడిన ఐదు వన్డేల్లోనూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన తొలి ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా సౌతాఫ్రికా బ్యాటర్ మాట్ బ్రీట్జ్‌‌‌‌కే (77 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 85) రికార్డు సృష్టించాడు. దాంతో  రెండో వన్డేలోనూ ఇంగ్లండ్‌‌‌‌ను ఓడించి సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా గురువారం అర్ధరాత్రి లార్డ్స్‌‌‌‌ స్టేడియంలో జరిగిన ఈ పోరులో సఫారీ టీమ్ 5 రన్స్ తేడాతో గెలిచింది. 

తొలుత సఫారీ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 330/8 స్కోరు చేసింది. బ్రీట్జ్‌‌‌‌కేతో పాటు ట్రిస్టాన్ స్టబ్స్ (58) ఫిఫ్టీ కొట్టగా.. ఐడెన్ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ (49), డెవాల్డ్ బ్రెవిస్ (42), ర్యాన్ రికెల్టన్ (35) రాణించారు. ఇంగ్లిష్ టీమ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌ నాలుగు, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో ఓవర్లన్నీ ఆడిన ఇంగ్లండ్ 325/9 స్కోరు చేసి ఓడిపోయింది. జో రూట్ (61), జోస్ బట్లర్ (61), జాకబ్ బెతెల్ (58) ఫిఫ్టీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లలో బర్గర్ మూడు, కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీశారు.  బ్రీట్జ్‌‌‌‌కేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో వన్డే ఆదివారం సౌతాంప్టన్‌‌‌‌లో జరగనుంది.