టికెట్ల తనిఖీలతో రైల్వేకు 223 కోట్లు

టికెట్ల తనిఖీలతో  రైల్వేకు 223 కోట్లు
  • దక్షిణ మధ్య రైల్వే జోన్ రికార్డు

హైదరాబాద్​సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేకు 2025–-26 ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీల ద్వారా రికార్డు స్థాయిలో  రూ. 223.60 కోట్ల ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రైల్వే బోర్డు నిర్దేశించిన రూ . 221.08 కోట్ల లక్ష్యాన్ని.. ఏడాది ముగియడానికి 14 రోజుల ముందే సాధించినట్టు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటి వరకు టికెట్ తనిఖీ ద్వారా వచ్చిన ఆదాయంలో ఇదే అత్యధికమని చెప్పారు.ఇంతకు ముందు  2023–-24 లో రూ . 220.81 కోట్ల ఆదాయం  నమోదైంది. 

టికెట్ లేని ప్రయాణం, ముందుగా బుక్ చేయని లగేజీ మొదలైన వాటిపై నమోదైన కేసుల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్టు అధికారులు వివరించారు. దక్షిణ మధ్య జోన్ పరిధిలో2025 అక్టోబర్ 18 న ఒక్క రోజే టికెట్ తనిఖీ ద్వారా రూ . 1.85 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రైల్వేలో టిక్కెట్ల తనిఖీ అనేది టిక్కెట్టు లేని, సరైన ఆధారాలు లేకుండా చేసే  ప్రయాణాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నది.టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణం చేయడం నేరమని సాధారణ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

ప్రయాణీకులకు సౌకర్యాలను  మెరుగుపరచి టిక్కెట్ల అమ్మకాలను పెంచడానికి, బుకింగ్ విండోతో పాటు టిక్కెట్ల జారీ కోసం డిజిటల్ టికెటింగ్​వంటివి ప్రవేశ పెట్టినట్టు వివరించారు. డిజిటల్ కార్యక్రమాలలో రైల్ వన్ యాప్, బుకింగ్ కౌంటర్ల దగ్గర ఏటీవీఎంలు, స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌ల వంటివి అందుబాటులో ఉంచామన్నారు. ఈ సంధర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను, సిబ్బందిని అభినందించారు. టికెట్ తనిఖీ అనేది ఒక పటిష్టమైన యంత్రాంగమని, టికెట్​లేని ప్రయాణాలను అరికట్టడంలో సహాయపడుతుందన్నారు. అలాగే నిజమైన రైలు ప్రయాణికులలో విశ్వాసానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.