
హైదరాబాద్ సిటీ, వెలుగు: దక్షిణ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) తన ప్యాసింజర్ల కోసం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైల్వే స్టేషన్ ఆవరణల్లో అధికారులు నియమించిన వ్యక్తులు వేసుకునే రెట్రో రిఫ్లెక్టివ్ జాకెట్ల వెనుక భాగంలోని క్యూఆర్ కోడ్‌ను (యూటీఎస్) యాప్‌తో స్కాన్ చేయడం ద్వారా జనరల్ టికెట్లను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. రిజర్వ్ చేయని టికెట్లను సులభంగా కొనుగోలు చేసేందుకు ఈ మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టారు.
రైల్వే ప్రయాణికుల నుంచి ఈ యాప్‌కు మంచి స్పందన వస్తోందని, ఉపయోగించే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో ప్రయాణించే అన్‌రిజర్వుడ్ ప్రయాణికులకు ఇది ఒక వరమని చెప్పారు. రాబోయే పండుగ సీజన్‌లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, స్టేషన్ ప్రాంతాల్లో యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ల కొనుగోలును ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ సౌకర్యాన్ని జోన్‌లోని ప్రధాన స్టేషన్లయిన సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, తిరుపతి, నాందేడ్‌లలో ప్రవేశపెట్టారు.