
- రెండో కంటైనర్ డిస్పాచ్
- చేసిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్
హైదరాబాద్, వెలుగు: గతిశక్తి కార్గో టెర్మినల్ లో భాగంగా వీక్లీ రీఫర్ కంటైనర్ స్పెషల్ సర్వీసును దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) హైదరాబాద్ డివిజన్ ప్రారంభించిందని ఎస్ సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కు సమీపంలో తిమ్మాపూర్ లోని ఎంఎస్ డీపీ వరల్డ్ మల్టీమోడల్ లాజిస్టిక్స్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ముంబైలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు బుధవారం రీఫర్ కంటైనర్ స్పెషల్ సర్వీసు ప్రారంభించామని ఆయన చెప్పారు. ఈ సర్వీసు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. ఈ నెల 1న రెండో రీఫర్ రేక్ ను డిస్పాచ్ చేశామని చెప్పారు.
తిమ్మాపూర్ నుంచి జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు గరిష్టంగా 72 గంటల్లో సరుకు రవాణా జరుగుతుందన్నారు. ఇప్పటికే గత నెల 24న ఈ సర్వీసును ప్రారంభించామని వెల్లడించారు. కేవలం 40 గంటల్లో సరుకు గమ్యస్థానానికి చేరుకుందన్నారు. ‘‘రీఫర్ కంటైనర్ స్పెషల్ సర్వీసుతో హైదరాబాద్ రీజియన్ లోని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి మరింత బూస్ట్ చేకూరుతుంది. ఈ సర్వీసుతో ఎగుమతిదారులు తమ కన్ సైన్ మెంట్లను ముంబైలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు వేగంగా, సురక్షితంగా కంటైనర్ లో రవాణా చేయవచ్చు.
దీంతోపాటు రైల్వేకు ఫ్రైట్ ఇన్ కం వస్తుంది” అని శ్రీధర్ వివరించారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్స్ వంటి ఫార్మా కంపెనీలకు ఈ సర్వీసు ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. ఆ కంపెనీలు తమ సరుకు రవాణా కోసం ఈ సర్వీసును వాడుకోవచ్చన్నారు.