- కొల్లూరులో ఐదు రోజుల పాటు ప్రదర్శన
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ శివారులో ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ (ఎస్‌ఐఎస్ఎఫ్)– 2026’ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం కొల్లూరులోని ది గౌడియం స్కూల్ వేదికగా ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రోగ్రామ్‌ను పలువురు మంత్రులు ప్రారంభించనున్నారు.
కాగా, బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం సహకారంతో రాష్ట్ర స్కూల్ విద్యా శాఖ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో పలు రాష్ట్రాలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొననున్నారు. రొటేషన్ పద్ధతిలో 2018 తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణకు ఈ అవకాశం దక్కింది.
కాగా, ఈ సైన్స్ ఫెయిర్‌లో ఆరు రాష్ట్రాల నుంచి మొత్తం 210 ప్రదర్శనలు కొలువుదీరనున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి 35 చొప్పున (10 గ్రూప్, 15 ఇండివిడ్యువల్, 10 టీచర్ ఎగ్జిబిట్స్) ప్రదర్శించనుండగా, ఇందుకోసం 210 మంది విద్యార్థులు, 210 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఈ నెల 23 వరకు కొనసాగే ఈ సైన్స్ ప్రదర్శనను ప్రతి రోజూ సుమారు 3 వేల నుంచి 4 వేల మంది విద్యార్థులు తిలకించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచించారు.
