- మంత్రి దామోదర రాజనర్సింహ
రామచంద్రాపురం, వెలుగు : స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణను కేరాఫ్‌గా మార్చడమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ పరిధిలోని గాడియం స్కూల్‌లో జరిగిన సౌత్ ఇండియా సైన్స్‌ఫేర్ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరై.. ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే బాషా ప్రావీణ్యంతో పాటు స్కిల్స్ సైతం అవసరమని, అందుకే ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.
సామాన్యులు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్, ఎస్ఈఆర్‌టీ డైరెక్టర్ రమేశ్, అడిషనల్ కలెక్టర్ పాండు, గాడియం స్కూల్ సీఈవో రామకృష్ణారెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్ ముగింపు సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆకట్టుకున్నాయి.
