సముద్ర మట్టాల పెరుగుదల, విపరీతమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు భవిష్యత్‌లో నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సిటీలు రాబోతున్నాయి. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ సపోర్ట్‌తో అమెరికాకు చెందిన ఓషియానిక్స్ అనే సంస్థ నీటిపై తేలియాడే ఇండ్లను నిర్మించే ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఈ మేరకు తాజాగా సౌత్ కొరియా ప్రభుత్వంతో ఫ్లోటింగ్ సిటీ నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని బుసాన్ మెట్రోపాలిటన్ సిటీలో 200 మిలియన్ డాలర్ల నిధులతో ఫ్లోటింగ్ సిటీ నిర్మించేందుకు ఓషియానిక్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ సిటీ 2025 లోపు ఇక్కడ అందుబాటులోకి రానుంది. సునామీలు, తీవ్ర తుఫానులు సహా ఇతర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ ఫ్లోటింగ్ సీటీని నిర్మించనున్నారు. నీటిపై తేలియాడే ప్లాట్‌ఫామ్‌లకు సముద్రపు అడుగుభాగంలో లంగరు వేయడం ద్వారా అవి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలవు.
ఇండ్లపై సోలార్ ప్లేట్స్..
ఫ్లోటింగ్ సిటీ భవనాల పైన సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేస్తారు. వీటి నుంచి ఆ నివాసాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఫ్లోటింగ్ సిటీలో నివసించే ప్రజలు మొక్కల నుంచి వచ్చే ఆహారంపైనే ఆధారపడాల్సి ఉంటుందని ఓషియానిక్స్ తెలిపింది. మొక్కల ద్వారా సేంద్రీయ ఉత్పత్తులను ఏరోపోనిక్, ఆక్వాపోనిక్ పద్ధతుల్లో పెంచుతారు. ఏరోపోనిక్స్ అనేది మట్టిని ఉపయోగించకుండా గాలి లేదా పొగమంచు వాతావరణంలో మొక్కలను పెంచే ఒక పద్ధతి. ఆక్వాపోనిక్స్ విధానంలో మొక్కలను పెంచడంతోపాటు మంచి బ్యాక్టీరియా సాయంతో చేపలను పెంచుతారు. ఇలా ప్రజలు ప్రధానంగా చేపలు, మొక్కలపైనే ఆధారపడి జీవనం సాగించాల్సి ఉంటుంది.
10 వేల మంది ఉండేలా..
ఫ్లోటింగ్ సిటీ ఎంత విస్తీర్ణంలో రానుంది అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకున్నా.. 75 హెక్టార్ల విస్తీర్ణంలో10 వేల మంది నివాసితులు ఉండేలా నిర్మాణం ఉంటుందని ఓషియానిక్స్ సంస్థ ప్రాథమికంగా అంచనా వేసింది. ఫ్లోటింగ్ సిటీలో పబ్లిక్ స్క్వేర్, మార్కెట్ ప్లేస్, కల్చరల్, హెల్త్, స్పోర్ట్స్ కేంద్రాలు కూడా ఉంటాయని సంస్థ చెబుతోంది. సౌత్ కొరియాలోని బుసాన్తోపాటు ఫ్లోటింగ్ సిటీల నిర్మాణం గురించి ఓషియానిక్స్ ఇతర దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది.
200 మిలియన్ డాలర్ల ఖర్చు
మొత్తం ప్రాజెక్ట్ 200 మిలియన్ డాలర్లు కాగా సిటీ నిర్మాణానికి వాడే మెటీరియల్స్, డిజైన్స్ బట్టి ఈ మొత్తం మారే అవకాశం ఉంది. తీర ప్రాంత నగరాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట మార్పులతో ప్రజలు ప్రకృతితో కలిసి జీవించడం సాధ్యమయ్యే కొత్త ఆలోచన మాకు ఇప్పుడు అవసరమని బుసాన్ మేయర్ పార్క్ హియోంగ్-జూన్ అభిప్రాయపడ్డారు. ఫ్లోటింగ్ సిటీ నిర్మాణానికి బుసాన్ కంటే మెరుగైన ప్రదేశం ఉండదన్నారు. అనేక తీరప్రాంత నగరాల మాదిరిగానే కొరియాలోని బుసాన్ సముద్ర మట్టాలు పెరగడంతో ముప్పు పొంచి ఉంది. సముద్ర మట్టం పెరగడం అనేది భయంకరమైన ముప్పు, ఫ్లోటింగ్ సిటీలుఈ విపత్తును పరిష్కరించడంలో కొంత సాయపడతాయని ఓషియానిక్స్ కో ఫౌండర్ ఇటాయ్ మడమోంబే, సంస్థ సీఈవో మార్క్ కాలిన్స్ చెన్ పేర్కొన్నారు. కాగా ఓషియానిక్స్ సంస్థ కొరియాలో చేపడుతున్న ప్రాజెక్టు కంటే ముందే తేలియాడే ఇండ్ల నిర్మాణాల ప్రస్తావన కొన్ని చోట్ల ఉంది. నెదర్లాండ్స్‌లో 2019లో ప్రపంచంలోనే మొదటిసారిగా కొందరు ఫ్లోటింగ్ ఫామ్ నిర్మించారు. ఈ తేలియాడే పొలంలో 40 ఆవులు పెంచుతూ.. పాలు, చీజ్, యోగర్ట్‌ను ఉత్పత్తి చేశారు. వాటిని సమీప ప్రాంతాల్లోని వినియోగదారులకు బైక్‌లు, ఎలక్ట్రిక్ వ్యాన్‌ల ద్వారా చేరవేసి ఆర్థికంగా లాభాలు పొందారు. బొలీవియా, పెరూ సరిహద్దుల్లోని టిటికాకా సరస్సులోనూ ప్రజలు రీడ్ ఐల్యాండ్స్‌ను తేలియాడే కమ్యూనిటీలుగా మార్చుకొని జీవనం సాగించారు.
ప్రమాదం అంచున మానవాళి
ఇటీవల స్కాట్లాండ్లోని గ్లాస్గోలో యునైటెడ్ నేషన్స్ క్లయిమేట్ చేంజ్ కాప్ 26 సదస్సు జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలను కొనసాగించేందుకు 200 దేశాలు అంగీకారం తెలిపాయి. ప్యారిస్ ఒప్పందం ప్రకారం.. ప్రపంచ సగటు టెంపరేచర్ పెరుగుదలను 2 డిగ్రీస్ సెల్సియస్(3.6 ఫారెన్‌హీట్) కంటే తక్కువ ఉంచాలని, 1.5 డిగ్రీ సెల్సియస్లకు పరిమితం చేసే ప్రయత్నాలను కొనసాగించాలి. గ్లోబల్ సగటు టెంపరేచర్2.7 ఫారెన్హీట్స్ కు పెరిగితే సముద్ర మట్టాలు 30.3 అంగుళాల వరకు పెరుగుతాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుత వేగంతో కొనసాగితే మాత్రం ప్యారిస్ ఒప్పందానికి తూట్లు పడటంతోపాటు మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని ఐపీసీసీ హెచ్చరించింది. గ్లోబల్ వార్మింగ్‌తో సముద్రమట్టాలు ఐలాండ్లు నీట మునగడం సహా లక్షలాది మంది నిరాశ్రయులుగా మారి శరణార్థులుగా ఇతర దేశాలకు వలస వెళ్లే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ముంపు వల్ల బిలియన్ డాలర్ల విలువైన మౌలిక సదుపాయాలు నాశనమయ్యే అవకాశం ఉంది. లక్షలాది మంది వారి ఇండ్లను విడిచిపెట్టి శరణార్థులుగా వెళ్లే ప్రమాదం ఉంది. ప్రపంచంలోని ప్రతి ఐదుగురిలో ఇద్దరు సముద్రతీరానికి 60 మైళ్ల దూరంలో నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మెగా నగరాలు సముద్ర మట్టాల పెరుగుదలకు గురయ్యే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడే ప్రమాదకరంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే ఫ్లోటింగ్ ఇండ్ల నిర్మాణం ఇందుకు ప్రత్యామ్నాయ మార్గం చూపుతోంది.
