లేడీ టీచర్లపై స్టూడెంట్స్, పేరెంట్స్ లైంగిక వేధింపులు

లేడీ టీచర్లపై స్టూడెంట్స్, పేరెంట్స్ లైంగిక వేధింపులు

గురువును దైవంగా భావించే సంస్కృతి మనది. ‘‘మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ” అన్నారు మన పెద్దలు. అంటే తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవంగా పూజించాల్సిన వ్యక్తిగా చదువులు చెప్పే గురువులనే చూపిస్తోంది మన భారతీయ సంస్కృతి. కానీ ఆ గురువులను దేవుళ్లుగా చూడడం అటుంచితే కనీస గౌరవం దక్కకుండా పోతోంది. కొన్ని చోట్ల విద్యార్థులే గురువులను చులకన చేసి కామెంట్లు చేయడం లాంటివి జరుగుతుంటే.. మరికొన్ని చోట్ల దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఆరో తరగతి, ఎనిమిదో తరగతి పిల్లల నుంచి డిగ్రీలు, పీజీలు చదివే స్టూడెంట్లు కూడా టీచర్ల వెంటపడి ఇబ్బంది పెడుతున్నారు. కొందరు తమ కోరిక తీర్చాలని నీచంగా ప్రవర్తిస్తుంటే.. ఇంకొందరు టీచర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం హీరో ఇజంలా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ మన చుట్టూ ఉన్న చాలా స్కూళ్లు, కాలేజీల్లో రోజూ జరుగుతూనే ఉన్నాయి. కానీ తమ పరువు పోతుందని కొందరు, పిల్లల భవిష్యత్తు పాడవుతుందని మరికొందరు టీచర్లు బయటపెట్టకుండా తమ పంటి బిగువున ఆ బాధలను భరిస్తూ విద్యా బోధన చేస్తున్నారు. ఆ వేధింపులను తట్టుకోలేక కొందరు తమ కెరీర్‌‌ను వదులుకుంటున్నారు కూడా. ఇలాంటి కొన్ని ఘటనలను ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. వేధింపులకు గురవుతున్న టీచర్లు తమ బాధలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోవడంతో వాటిని ప్రపంచం ముందు పెట్టారామె. వారి ప్రైవసీకి భంగం కలగకుండా పేర్లను కవర్ చేసి ఆ మెసేజ్‌ల స్క్రీన్ షాట్‌లను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు.

టీచర్‌‌కు ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు పంపిన స్టూడెంట్

ఈ ట్విట్టర్ పోస్ట్ చేసిన వాటిలో వివరాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి. స్కూల్‌ స్టూడెంట్లు కొంత మంది తమకు ఫోన్లు, మెసేజ్‌లు చేసి లైంగికంగా వేధిస్తున్నారని, కొద్ది మంది దీని కోసంగా కొత్త నంబర్లు తీసుకుని మరీ కాల్స్ చేస్తున్నారని కొందరు టీచర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే ఒక 50 ఏండ్ల టీచర్‌‌కు ఎదురైన  పరిస్థితిని ఆమె కుమార్తె చిన్మయికి మెసేజ్‌ చేశారు. ‘‘ప్రస్తుతం అన్ని ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండడం వల్ల పిల్లలకు ఫోన్‌ చేసి అందరూ  క్లాసుకు అంటెండ్ అవుతున్నారాల లేదా చూసుకోవాల్సి వస్తోంది. వాళ్లలో ఒక స్టూడెంట్ తన సొంత నంబర్‌‌ నుంచే ప్రైవేట్ పార్ట్స్‌ ఫొటోలు పంపుతున్నాడు. దీని గురించి అమ్మ తనతో పని చేసే మగ టీచర్లకు చెబితే... ‘మీకు పెండ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు. మీది గౌరవప్రదమైన కుటుంబం. ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేయండి’ అంటూ వాళ్లు సలహా ఇచ్చారు. చివరికి మేం ఏం చేయలేక సైలెంట్‌గా వదిలేశాం’’ అని చెప్పింది.

స్టూడెంట్స్ తండ్రులు కూడా..

మరో టీచర్ కుమార్తె.. చిన్మయికి పంపిన మెసేజ్ చూస్తే ఇంత కంటే ఘోరం ఉంటుందా అనిపిస్తుంది. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తండ్రులు కూడా టీచర్లపై వేధింపులకు దిగుతుండడం దారుణం. ‘‘మా అమ్మ ఒక గవర్నమెంట్ హైస్కూల్‌లో టీచర్. ఆమె కొలీగ్స్ కొంత మంది ప్రైమరీ క్లాసులకు బోధిస్తారు. అయితే ఆ పిల్లల అసైన్‌మెంట్లు వాళ్ల తండ్రుల ఫోన్‌కు పంపాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ల నుంచి వచ్చే కాల్స్ ఆన్సర్ చేయాలన్నా, మెసేజ్‌లు ఓపెన్ చేయాలన్నా భయపడుతుంటారు.  దీని కారణంగా అర్ధరాత్రి సమయాల్లో కూడా స్టూడెంట్స్ తండ్రులు ఆ లేడీ టీచర్లకు మెసేజ్‌లు చేసి వేధిస్తుంటారు. ఇవి భరించలేక కొంత మంది అయితే మగ టీచర్ల సాయం తీసుకుని అసైన్‌మెంట్లను పిల్లల పేరెంట్స్‌కు పంపుతున్నారు” అని వివరించారు. ఇలాంటి సంఘనలెన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే చిన్నయి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. డిగ్రీ కాలేజీల్లోనూ తమ స్టూడెంట్ల నుంచి లేడీ లెక్చరర్లు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు. అలాగే లేడీ రీసెర్చ్ స్టూడెంట్లకు కూడా తమ గైడ్స్‌ నుంచి తీవ్రమైన లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. ఇలాంటి తీరు ఎప్పటికి మారేనో.. వర్క్‌ ప్లేస్‌లో వేధింపులు లేకుండా మహిళలు ఎప్పటికి పని చేయగలుగుతారో అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.