- నారీ.. మోగించు విజయభేరి
- నవంబర్ 3న విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్
- సౌతాఫ్రికాతో ఇండియా ఢీ..
- ఫేవరెట్‌గా హర్మన్‌సేన.. మధ్యాహ్నం 3గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
- మన దేశ క్రికెట్‌ను పండుగలా మార్చిన ఘట్టాలు
- కానీ, మన అమ్మాయిల చరిత్రలో మాత్రం ఆ వెలుగు ఇంకా రాలేదు
- 1983లో కపిల్ డెవిల్స్ క్లాసిక్ షో
- 2007 టీ20 కప్‌లో ధోనీసేన సంచలనం
- 2011లో సచిన్ కల నెరవేర్చిన విజయం..
- మన దేశ క్రికెట్‌ను పండుగలా మార్చిన ఘట్టాలు
- ఇప్పుడు, ఆ లోటును పూడ్చేసే రోజు రానే వచ్చింది
దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని గెలిచేందుకు.. తమ కలను సాకారం చేసుకునేందుకు ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ సిద్ధమైంది. ముంబైలో ఆదివారం జరిగే వరల్డ్ కప్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
2005, 2017, 2020 (టీ20 కప్)లో ఫైనల్ గడపదాకా వచ్చి.. చివరి మెట్టుపై బోల్తా పడ్డారు. ప్రతిసారీ అభిమానుల గుండె నిరాశతో మూగబోయింది.
దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో ఉంది. అత్యంత బలమైన ఆస్ట్రేలియాను సెమీఫైనల్లోనే రఫ్పాడించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సైన్యం.. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న మెగా ఫైనల్‌కు సిద్ధమైంది.!
నేడు సౌతాఫ్రికాపై గెలిస్తే... అది కేవలం ఒక క్రికెట్ విజయం కాదు! దేశంలో ఈ ఆటను ఇష్టపడే ప్రతి అమ్మాయి కలను, దశాబ్దాల నిరీక్షణను, క్రికెటర్ల కఠోర శ్రమను సార్ధకం చేసిన చారిత్రక ఘట్టం అవుతుంది! మరి, కోట్లాదిమంది అభిమానుల ఆశీస్సులు అండగా ఉండగా.. హర్మన్‌సేన కొత్త చరిత్ర సృష్టిస్తుందా? మన అమ్మాయిలు ఈసారైనా జగజ్జేతలు అవుతారా?
నవీ ముంబై: ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ ఒక చారిత్రాత్మక ఘట్టం అంచున నిలిచింది. కపిల్ దేవ్ కెప్టెన్సీలోని మెన్స్ టీమ్ 1983లో సాధించిన హిస్టారికల్ విక్టరీని గుర్తుకు తెస్తూ, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియా జట్టు ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఆదివారం ఇక్కడ జరిగే విమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో బలమైన సౌతాఫ్రికాతో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
గత 12 ఎడిషన్లలో ఆస్ట్రేలియా (ఏడుసార్లు), ఇంగ్లండ్ (4 సార్లు), న్యూజిలాండ్ (ఒకసారి) మాత్రమే విజేతలుగా నిలవగా.. ఈసారిఒక కొత్త చాంపియన్ అవతరించనుంది. మూడోసారి ఫైనల్ ఆడుతున్న ఇండియా, తొలిసారి టైటిల్ ఫైట్‌కు చేరిన సౌతాఫ్రికా రెండూ మెగా టోర్నీలో అద్భుతమైన ఆటతో ఆఖరాటకు చేరుకున్నాయి. ఎవ్వరు గెలిచినా కొత్త చరిత్ర సృష్టించనున్నాయి.
అయితే, సొంతగడ్డపై ఆడుతున్న ఇండియానే ఈ మెగా ఫైనల్లో ఫేవరెట్. హర్మన్‌సేన వరల్డ్ కప్ గెలిస్తే మన దేశ మహిళా క్రికెట్ మరో స్థాయికి చేరుకోగలదు. మూడేండ్ల కిందట మొదలైన విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కంటే మించి దేశవ్యాప్తంగా అమ్మాయిల్లో క్రికెట్‌పై ఆసక్తిని పెంచి, కొత్త తరానికి స్ఫూర్తినివ్వడం ఖాయం.
ఆఖరి అడ్డంకి దాటేనా?
ఈ టోర్నీలో ఇండియా ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. రెండు విజయాలతో టోర్నీని ఘనంగా ఆరంభించిన తర్వాత వరుసగా మూడు ఓటములతో సొంతగడ్డపై సెమీస్ చేరడమే కష్టమనేలా మారిన పరిస్థితుల నుంచి మన టీమ్ అద్భుతంగా పుంజుకుంది.
మాజీ చాంపియన్ న్యూజిలాండ్, ఏడుసార్లు విజేత ఆస్ట్రేలియాలను ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచిన తీరు అద్భుతం. ముఖ్యంగా జెమీమా రోడ్రిగ్స్ (127నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ చారిత్రాత్మకం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (89) తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. అయితే, ఈ భావోద్వేగ విజయం నుంచి ఇండియా ఎంత త్వరగా తేరుకుంటే అంత మంచిది.
ఎందుకంటే, ఇండియాకు అసలైన ప్రత్యర్థి సౌతాఫ్రికా కాదు, ఫైనల్ ఫోబియా. 2005 తొలి ఫైనల్లో లెజెండరీ ప్లేయర్ మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని ఇండియా.. ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. 2017 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 9 రన్స్ తేడాతో ఓటమి, ఆ జట్టులో భాగమైన హర్మన్‌ప్రీత్‌తో సహా చాలా మందిని ఇప్పటికీ బాధిస్తోంది.
2020 టీ20 కప్ ఫైనల్‌తో పాటు 2022 కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో మరో గుండెకోత ఇంకా వెంటాడుతున్నాయి. ఈ పాత గాయాలు, ఆఖరి అడ్డంకిని దాటలేకపోతున్నామన్న ఒత్తిడి నేపథ్యంలో తమ స్కిల్స్, ఫామ్ చూపెట్టడం కంటే ప్రెజర్‌ను జయించడమే హర్మన్ సేనకు అతిపెద్ద సవాలు కానుంది.
ఓపెనింగ్, బౌలింగ్‌పైనే బెంగ
బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, జెమీమా, కెప్టెన్ హర్మన్ ఫామ్ జట్టుకు బలం. టోర్నీలో 385 రన్స్ చేసిన స్టార్ బ్యాటర్ మంధానపై ఆఖరాటలో భారీ అంచనాలున్నాయి. మూడో నంబర్‌లో కొత్త ఆశాకిరణంగా మారిన జెమీమా రోడ్రిగ్స్ కివీస్‌పై ఫిఫ్టీ, ఆసీస్‌పై సెంచరీతో అద్భుత ఫామ్‌లో ఉంది. గత మ్యాచ్‌లో హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో టచ్‌లోకి రావడం అతి పెద్ద సానుకూలాంశం. ఈ ముగ్గురూ మెప్పిస్తే టీమ్‌కు తిరుగుండదు.
అయితే, సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రతీక రావల్ గాయపడటంతో తుది జట్టులోకి వచ్చిన ఓపెనర్ షెఫాలీ వర్మ గత పోరులో నిరాశపరిచింది. చెత్తాట కారణంగా నేషనల్ టీమ్‌కు దూరమై.. అనూహ్యంగా తిరిగొచ్చిన షెఫాలీ ఫైనల్లో మంధానతో కలిసి మంచి ఓపెనింగ్ అందిస్తే జట్టుతో పాటు తన కెరీర్‌కు అది ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ, బౌలింగ్ విభాగం ఆందోళన కలిగిస్తోంది.
ఫ్లాట్ పిచ్‌పై పేసర్లు క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్ లయ తప్పారు. ఫీల్డింగ్ వైఫల్యాలు సెమీస్‌లో స్పష్టంగా కనిపించాయి. టోర్నీలో 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆల్-రౌండర్ దీప్తి శర్మపైనే బౌలింగ్ భారం మొత్తం పడనుంది. మిగతా బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవడంతో పాటు ఫీల్డింగ్‌లో ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా చూసుకోవడం కీలకం కానుంది.
సఫారీ.. తక్కువేం కాదు
సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేస్తే పొరపడినట్లే. ఈ టోర్నీలో సఫారీల ప్రయాణం వాళ్ల మానసిక బలానికి నిదర్శనం. ఇంగ్లండ్‌పై 69 రన్స్‌కే ఆలౌట్, ఆస్ట్రేలియాపై 97 స్కోరుకు కుప్పకూలడం వంటి ఘోర పరాజయాల నుంచి గొప్పగా కోలుకున్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నుంచి సఫారీ ప్లేయర్లు వారు చాలా నేర్చుకున్నారు.
ఈసారి ఒక్క అడుగు ముందుకు వేసి కప్ గెలవాలనే కసితో ఉన్నారు. జట్టుగా, కలిసికట్టుగా ఆడటమే వాళ్ల బలం. కెప్టెన్ లారా వోల్‌వార్ట్ (470 రన్స్) టోర్నీలో టాప్ స్కోరర్‌గా జట్టును ముందుండి నిడిపిస్తోంది. తన ఫామ్ ఇండియా బౌలర్లకు పెద్ద సవాలు.
వెటరన్ ఆల్-రౌండర్ మారిజేన్ కాప్ (204 రన్స్, 12 వికెట్లు) బ్యాట్, బాల్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలదు. డి క్లెర్క్ (190 రన్స్), తజ్మిన్ బ్రిట్స్ (212 రన్స్) కూడా కీలకం. ముఖ్యంగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎంలబా (12 వికెట్లు) ఇండియా రైట్ హ్యాండ్ బ్యాటర్లకు పెద్ద ముప్పుగా మారనుంది.
పిచ్ / వాతావరణం
డీవై పాటిల్ స్టేడియం వికెట్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. సాయంత్రం మంచు ప్రభావం కూడా ఉండవచ్చు. ఇండియాకు ఈ గ్రౌండ్‌పై పూర్తి పట్టు ఉండగా.. సౌతాఫ్రికా ఈ టోర్నీలో ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం వారికి ప్రతికూలాంశం. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం పడే సూచన ఉంది. ఫైనల్ కోసం రిజర్వ్ డే (సోమవారం) అందుబాటులో ఉంది. ఆదివారం ఆటకు ఎక్కువ సేపు అంతరాయం కలిగితే సోమవారం కొనసాగిస్తారు
ఎవరిదో పైచేయి
ఎంలబాx మంధాన: సఫారీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎంలబా వన్డేల్లో ఇండియా స్టార్ బ్యాటర్ మంధానను మూడు సార్లు ఔట్ చేసింది. ఈ ఇద్దరి పోరు పవర్‌ప్లేలో కీలకం కానుంది.
వోల్‌వార్ట్ x దీప్తి శర్మ: ఫామ్‌లో ఉన్న వోల్‌వార్ట్‌ను దీప్తి తన స్పిన్‌తో ఎలా కట్టడి చేస్తుందన్న దానిపై మ్యాచ్ ఆధారపడి ఉంది. దీప్తి బౌలింగ్‌లో మూడు సార్లు ఔటైన వోల్‌వార్ట్ స్ట్రయిక్ రేట్ (54.91) చాలా తక్కువగా ఉంది.
మారిజేన్ కాప్ x హర్మన్‌ప్రీత్: ఈ ఇద్దరు దిగ్గజాల పోరు రసవత్తరంగా ఉండనుంది. కాప్ బౌలింగ్‌లో హర్మన్ 4 సార్లు ఔటైంది.
ఇండియా పేసర్లు x సఫారీ ఓపెనర్లు: ఫ్లాట్ పిచ్‌పై రేణుక, క్రాంతి కొత్త బాల్‌తో వోల్‌వార్ట్, బ్రిట్స్‌ను త్వరగా పెవిలియన్ చేర్చకపోతే ఇండియా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది
తుది జట్లు (అంచనా) ఇండియా: మంధాన, షెఫాలీ, జెమీమా, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), దీప్తి, రిచా ( కీపర్), అమన్‌జోత్, రాధా యాదవ్/స్నేహ్ రాణా, క్రాంతి, శ్రీ చరణి, రేణుక.
సౌతాఫ్రికా: వోల్‌వార్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అనెకె బాష్/మసబతా క్లాస్, సునే లూస్, మారిజేన్ కాప్, సినాలో జాఫ్తా ( కీపర్), అనెరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నడిన్ డిక్లెర్క్, అయబొంగా ఖాకా, ఎంలబా.
