
- సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ వెల్లడి
- సికింద్రాబాద్ సర్కిల్ లో ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చేయడమే లక్ష్యంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్‌పీడీసీఎల్) పనిచేస్తున్నదని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం గృహవినియోగ (ఎల్టీ) నెట్వర్క్‌లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ స్థాయి వరకు తనిఖీలు చేపట్టి, గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు సూపరింటెండింగ్ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, డైరెక్టర్ (ఆపరేషన్స్) డాక్టర్ నర్సింహులుతో కలిసి మంగళవారం ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని జింఖానా సెక్షన్‌లోని పలు బస్తీలు, ఇరుకు గల్లీల్లో దాదాపు 5 కిలోమీటర్ల మేర కాలినడకన తనిఖీలు చేశారు.
వినియోగదారులతో మాట్లాడుతూ ఎల్టీ నెట్వర్క్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వేలాడుతున్న తీగలు, జాయింట్లతో ఉన్న కేబుల్స్, సరైన ఇన్సులేషన్ లేని హెచ్‌జీ ఫ్యూజ్ సెట్‌లను గుర్తించారు. వాటిని సరిచేసి, ఫోటోలను తమకు పంపాలని అధికారులను ఆదేశించారు. సెక్షన్ అధికారులు (అసిస్టెంట్ ఇంజినీర్లు) ఉదయం 8 గంటల నుంచి కార్యాచరణ ప్రారంభించి, ఏరియా వారీగా ఎల్టీ నెట్వర్క్‌లో పోల్ టు పోల్ తనిఖీలు చేయాలని, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని సీఎండీ స్పష్టం చేశారు. విద్యుత్ ఇంజినీర్లు, సిబ్బంది నిరంతర కృషి వల్ల 33 కేవీ, 11 కేవీ నెట్వర్క్‌లో సమస్యలు గణనీయంగా తగ్గాయన్నారు. గాలులు, వర్షాల వల్ల చెట్లు, కొమ్మలు విరిగి స్తంభాలపై పడినప్పుడు మాత్రమే సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయని, అటువంటి సమస్యలను కూడా తక్కువ సమయంలో పరిష్కరిస్తున్నామని ఫరూఖీ వెల్లడించారు.ప్రత్యేక డ్రైవ్ పూర్తయ్యే వరకు తాను క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని పేర్కొన్నారు. ఈ తనిఖీలలో డైరెక్టర్ (ఆపరేషన్స్) నర్సింహులు, చీఫ్ ఇంజినీర్ (మెట్రో) ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.