
- పారదర్శక సేవల కోసం ఆటోఎస్టిమేట్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి
- డిస్కం సీఎండీ ఫారూఖీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైటెన్షన్ (హెచ్ టీ) కనెక్షన్ పొందేందుకు సదరన్ డిస్కం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. వినియోగదారులకు పారదర్శక సేవలు అందించేందుకు ఆటోఎస్టిమేట్ సాఫ్ట్‌వేర్ విధానాన్ని అభివృద్ధి చేశామని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 33 కేవీ హై టెన్షన్ (హెచ్టీ) కనెక్షన్ దరఖాస్తుల జారీ ప్రక్రియలో అక్రమాలు జరగకుండా సులభతరం చేసేందుకు కొత్త విధానం రూపొందించామని సీఎండీ తెలిపారు.
హెచ్టీ సర్వీస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన వినియోగదారుల వివరాలను హైటెన్షన్ కన్య్జూమర్ సర్వీస్ కనెక్షన్ (హెచ్టీసీఎస్సీ) సిస్టం ద్వారా జీఐఎస్ కోఆర్డినేట్లతో సేకరించి సాసా యాప్ ద్వారా నేరుగా సంస్థ హెడ్డాఫీసులోని చీఫ్ ఇంజినీర్ (కమర్షియల్) కు పంపిస్తామని ఆయన చెప్పారు. ‘‘ఈ సమాచారం ఆధారంగా సాసా యాప్ ఆటోమేటెడ్ ఎస్టిమేట్‌ను రూపొందిస్తుంది. ఆ ఎస్టిమేట్ ఆమోదం పొందిన వెంటనే డిమాండ్ నోటీసు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది.
ఈ వివరాలు వినియోగదారుడికి ఎస్ఎంఎస్, ఈ -మెయిల్ ద్వారా అందుతాయి. అదే సమయంలో సంబంధిత అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ), డివిజనల్ ఇంజినీర్ (డీఈ), సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) ఆపరేషన్ సిబ్బందికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. ఈ సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు అతి తక్కువ సమయంలో జారీ అవుతాయి. కొత్త పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ సంస్థల యాజమాన్యాలకు హెచ్టీ కనెక్షన్లను సులభతరం చేసేందుకు ఆటోఎస్టిమేట్ సాఫ్ట్‌వేర్ విధానం ప్రవేశపెట్టాం” అని సీఎండీ వివరించారు. ఈ విధానంలో మధ్యవర్తుల అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని సీఎండీ తెలిపారు.