
న్యూఢిల్లీ/లండన్: అమెరికాలో సంక్షోభానికి కారణమైన ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణాతో లింక్ఉన్న ఇండియన్ బిజినెస్ పర్సన్స్, వారి కుటుంబ సభ్యుల వీసాలను యూఎస్ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి రీఅప్లికేషన్లను తిరస్కరించినట్టు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ గురువారం వెల్లడించింది. ఇకపై వారు యూఎస్ప్రయాణానికి అనర్హులని పేర్కొంది.
డ్రగ్స్ అక్రమ రవాణాను ఎదుర్కొనేందుకు అమెరికా-, భారత్ నిబద్ధతతో పని చేస్తున్నాయని తెలిపింది. ఈ విషయంలో సహకరించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా, వామపక్ష భావజాలమున్న ఎంటిఫా(యాంటీ ఫాసిస్ట్స్) సంస్థను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దానిని అతి ప్రమాదకరమైన సంస్థగా పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఈ ప్రకటన చేశారు.
బ్రిటన్ ప్రధానితో ట్రంప్ చర్చలు..
ట్రంప్‌కు బ్రిటన్‌లో ఘన స్వాగతం లభించింది. రెండురోజుల పర్యటనలో భాగంగా బుధవారం తన భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి లండన్‌కు వచ్చిన ఆయనకు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 ఆతిథ్యం ఇచ్చారు. గురువారం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నివాసంలో ఆయనతో ట్రంప్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సవరణ, రష్యా--–ఉక్రెయిన్, ఇజ్రాయెల్--–హమాస్ యుద్ధాలు, ఇతర వ్యూహాత్మక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.