చల్లటి కబురు.. ముందుగానే నైరుతి..

చల్లటి కబురు.. ముందుగానే నైరుతి..

ఐఎండీ (IMD) గుడ్ న్యూస్ వినిపించింది. ఎండలతో సతమతమౌతున్న ప్రజలకు చల్లటి కబురు వినిపించింది. ముందుగానే నైరుతి రుతుపవనాలు విచ్చేస్తున్నాయని వెల్లడించింది. అండమాన్, నికోబార్ దీవుల్లో మే 15వ తేదీలోపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. జూన్ 01వ తేదీన కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయనే సంగతి తెలిసిందే. మే 15వ తేదీన అండమాన్ నికోబార్ దీవులను దాటుకుని 22వ తేదీ కల్లా... ఆగ్నేయ బంగా‌ళా‌ఖాతంలోకి ప్రవే‌శించే అవ‌కాశం ఉందని.. ఉత్తర ప్రాంతమైన మాయాబందర్‌‌ను తాకుతాయని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు.  ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెల 05వ తేదీ నుంచి 08వ తేదీ లోపు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఇక ఎండల విషయానికి వస్తే.. దేశంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో గురువారం 44 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యాయి. బార్మర్‌‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు, బికనీర్, జైసల్మేర్ లో 47.2, చురు 46.9, కోట 46.7, ఖర్గోన్ 46.4, రాజ్ గఢ్, జోధ్ పూర్ లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలోని ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండకపోవచ్చని.. అనంతరం 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. 

Read More : న్యాయం కోసం కశ్మీరీ పండిట్ల ఆందోళన