
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని రోజులపాటు బలహీనపడిన నైరుతి రుతుపవనాలు.. మళ్లీ యాక్టివ్ అయ్యాయి. ఒడిశా తీరం.. బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని శుక్రవారం బులెటిన్‌లో వెల్లడించింది.
అల్పపీడన ప్రభావంతో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది.
శుక్రవారం నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, వికారాబాద్, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా కోల్వాయిలో 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 3.6, హనుమకొండ జిల్లా నడికుడలో 2.6 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. గత రెండు మూడు రోజుల నుంచి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 3, 4 రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశమంతా విస్తరించినట్టు ఐఎండీ తెలిపింది. మరో రెండు మూడు రోజుల్లో ఆ మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తాయని వెల్లడించింది.