రెండు మూడు రోజుల్లో నైరుతి దూకుడు

రెండు మూడు రోజుల్లో నైరుతి దూకుడు

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుఫాను వల్ల రుతుపవనాల మందగమనం కొనసాగుతోంది. నైరుతి నెమ్మదిగా కదులుతుండటంతో చాలా రాష్ట్రాలకు రుతుపవానాలు చేరనేలేదు. గుజరాత్ వద్ద సముద్రంలో ఏర్పడిన సైక్లోన్ క్రమంగా తగ్గుతోంది. దీంతో నైరుతి మళ్లీ ఊపందుకోనుందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు మూడు రోజుల్లో నైరుతి చురుగ్గా కదలనుందని, వర్షాలు కురుస్తాయని చెప్పింది. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనుందని తెలిపింది.

43 శాతం లోటు వర్షపాతం

రుతుపవనాల మందగమనం కారణంగా దేశవ్యాప్తంగా 43 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సెంటర్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారం సౌతిండియా రాష్ట్రాలు, మహారాష్ర్టలోని రిజర్వాయర్లలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి నీటి నిల్వలు తగ్గిపోయాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. జార్ఖండ్, బీహార్, ఒడిశాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.

20న రాష్ట్రానికి రుతుపవనాలు

రుతుపవనాలు 20వ తేదీన రాష్ర్టానికి, 18న ఆంధ్రప్రదేశ్​కు రానున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈనెల 13న రాష్ర్టానికి నైరుతి రావాల్సి ఉండగా, ‘వాయు’ వల్ల ఆలస్యమైందని తెలిపింది. రుతుపవనాలు జోరందుకున్నాయని, చురుగ్గా కదులుతున్నాయని చెప్పింది. సోమ, మంగళవారాల్లో రాష్ర్టవ్యాప్తంగా అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.