బ్యాంకులు, ఏటీఎంల వద్ద అలారం వ్యవస్థ ఉండాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

బ్యాంకులు, ఏటీఎంల వద్ద అలారం వ్యవస్థ ఉండాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, వెలుగు: బ్యాంకులు, ఏటీఎం, గోల్డ్ లోన్ ఆఫీసుల వద్ద అలారం వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో పోలీసులు, బ్యాంక్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. బ్యాంకుల్లో డబ్బులు, బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉంటాయని ప్రజలు నమ్ముతుంటారని, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కలిసికట్టుగా నేరాల నియంత్రణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సెన్సార్లను, సీసీటీవీ కెమెరాలను, అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ అలారం వ్యవస్థను దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్​కు అనుసంధానం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్ రావు, ఫణిధర్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.