ఆయన గాత్రం ఎప్పటికీ బతికే ఉంటుంది

ఆయన గాత్రం ఎప్పటికీ బతికే ఉంటుంది

చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కన్నుమూశారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా సినీ ఇండస్ట్రీకి బాలు ఎంతో సేవ చేశారు. బాలు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు తీర్చలేదని, బాలు గాత్రం అజరామరం అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు బాలుకు నివాళులు తెలిపారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్త విని షాక్‌‌కు గురయ్యానని వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు అన్నారు. సంగీత ప్రపంచంలో ఆయన లేని లోటును భర్తీ చేయడం కష్టసాధ్యమన్నారు.

‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబీకులు, మిత్రులకు సంతాపం తెలియజేస్తున్నా. పలు భాషల్లో ఆయన పాటలు లక్షలాది ప్రజలను మైమరిపించాయి. ఆయన గాత్రం బతికే ఉంటుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

బాలసుబ్రహ్మణ్యం గారు లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నా టాలీవుడ్ సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు అన్నారు. ఆయన వారసత్వం బతికే ఉంటుందన్నారు.

‘బాలు సార్ మీరు చాలా ఏళ్ల పాటు నా గొంతుకలా ఉన్నారు. మీ గాత్రం, మీతో మెమొరీస్ నాతో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. నేను మిమ్మల్ని మిస్సవుతున్నా’ అని సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు.

‘బాలసుబ్రహ్మణ్యం సార్ మరణ వార్త విని నా హృదయం ముక్కలైంది. ఘనమైన సంగీత వారసత్వంతో మీరెప్పటికీ బతికే ఉంటారు. ఆయన కుటుంబీకులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.