వికారాబాద్, వెలుగు : ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. 2023ఏడాదికి సంబంధించి యాన్యువల్ క్రైమ్ రిపోర్టు వివరాలను గురువారం మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది చాలా తక్కువ కేసులు నమోదయ్యాయని వివరించారు. ఈ ఏడాదిలో జిల్లాలో మొత్తం 3,588 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో జిల్లా పోలీసు యంత్రాంగం కలిసికట్టుగా పని చేసి ఎక్కడ ఎలాంటి ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. 9,196 లేజర్ గన్ కేసుల ద్వారా వాహనాల వేగాన్ని నియంత్రించి జిల్లాలో రాత్రి సమయంలో 3,674 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించామని తెలిపారు. యువత ఆత్మహత్యలకు పాల్పడుతూ.. బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటుండటంతో కారణాలు తెలుసుకొని ఈ ఏడాదిలో కళాజాతర బృందాలతో 139 కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఆత్మహత్యలను తగ్గించామని వివరించారు. నేరాలు తగ్గించడంలో సీసీ టీవీలు కీలకపాత్ర అని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. 2023లో 1,035 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలతో 22 మంది పిల్లలను రక్షించామన్నారు. టాస్క్ ఫోర్స్ టీంను మరింత బలోపేతం చేసి అక్రమ కార్యకలాపాలు, నకిలీ విత్తనాలు, గంజాయి, కల్తీ ఐస్‌క్రీమ్‌లు, టీ పౌడర్, పీడీఎస్ రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటివి అరికట్టేందుకు కృషి చేశామన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం135 కేసులు నమోదు చేసి 420 మంది నేరస్తులను అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో అత్యాచార, పోక్సో కేసుల్లోబాధితులకు భరోసా సెంటర్లు అండగా నిలుస్తాయని ఆయన వివరించారు.
జిల్లా ఆఫీసులో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను ఆధునికమైన టెక్నాలజీతో సీసీ కెమెరాలను మానిటరింగ్ చేస్తున్నామన్నారు. జిల్లాలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులను గుర్తించి రివార్డులు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
