మహిళా అభ్యర్థి చీరలాగిన ప్రత్యర్థులు

మహిళా అభ్యర్థి చీరలాగిన ప్రత్యర్థులు

మహాభారతంలో దుశ్శాసనుడు నిండు సభలో అందరూ చూస్తుండగానే ద్రౌపది చీర లాగాడు. అచ్చు అటువంటి ఘటనే యూపీలోనూ జరిగింది. నామినేషన్ వేయడానికి వెళ్తున్న మహిళా అభ్యర్థి చీర లాగారు ప్రత్యర్థులు. ఈ సంఘటన లఖింపూర్ ఖేరి జిల్లాలోని పాస్‌గవాన్ బ్లాక్‌లో జరిగింది. త్వరలో యూపీలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. పాస్‌గవాన్ బ్లాక్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు రీతూ సింగ్ అనే మహిళ పోటీచేయడానికి నిశ్చయించుకుంది. దాంతో ఆమె గురువారం నామినేషన్ వేయడానికి కొంతమంది మహిళా కార్యకర్తలతో కలిసి నామినేషన్ ఆఫీసుకు బయలుదేరింది. ఆ ఆఫీసు ముందుకు వెళ్లగానే కొంతమంది దుండగులు ఆమెను అడ్డగించి.. చీర లాగారు. అనంతరం నామినేషన్ పత్రాలను లాక్కొని చింపివేశారు. దాంతో యూపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఈ ఘటనను ఖండిస్తూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థి చీర లాగడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ దుశ్శాసన పర్వాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. సీఎం యోగి ఆదిత్యానాథ్ అండతోనే బీజేపీ కార్యకర్తలు ఈ దుర్మార్గానికి బరితెగించారని అఖిలేష్ మండిపడ్డారు. రీతూ సింగ్‌పై దాడి చేసిన వ్యక్తులు.. మొహమ్మది ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్ మనుషులని ఆయన అన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రీతూ సింగ్ ఫిర్యాదు ఆధారంగా నిందితులపై ఐపీసీ ప్రకారం.. 147, 171 ఎఫ్, 354, 392, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులలో ఒకరిని యశ్ వర్మగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.