- ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: చలి కాలంలో ఉదయం వేళలో పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరమని, డ్రైవర్లు అలర్ట్ గా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేర్కొన్నారు. జిల్లాలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో పొగమంచు కారణంగా రోడ్లపై దృష్టి మందగించడం, వాహనాలు, పాదచారులు, సిగ్నల్స్ స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు.
ఈ పరిస్థితుల్లో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున డ్రైవర్లు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొగమంచు కారణంగా ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున కొంచెం ముందుగానే బయలుదేరాలని చెప్పారు.
అతివేగం, ఓవర్ టేకింగ్ పూర్తిగా నివారించాలని పేర్కొన్నారు. హైబీమ్ వలన పొగమంచు కాంతిని చెదరగొట్టి దృష్టి తగ్గించే ప్రమాదం ఉన్నందున లోబీమ్ లైట్లు, ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు. ముందు వెళ్తున్న వాహనం స్పష్టంగా కనిపించకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని సురక్షిత దూరం పాటించాలని పేర్కొన్నారు.
