
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని ఎస్పీ యోగేశ్ గౌతమ్అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో గణేశ్ఉత్సవ కమిటీల సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా జిల్లాలో డీజేలను నిషేధించినట్లు తెలిపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నారాయణపేట టౌన్ లో- 2, రూరల్ పోలీస్ స్టేషన్‌పరిధిలో -3, దామరగిద్దలో 2, మద్దూర్ లో -1 మొత్తం 8 డీజేలను సీజ్ చేశామన్నారు. డీజేలు వినియోగిస్తే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గణేశుని విగ్రహాల శోభాయాత్ర రూట్ పరిశీలన
కోస్గి, వెలుగు: కోస్గి మండల కేంద్రంలో వినాయక విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే రూట్ ను ఎస్పీ యోగేశ్‌గౌతమ్ సోమవారం పరిశీలించారు. అంతకుముందు స్థానిక మున్నూరుకాపు వాడ, బార్పేట్ వినాయక విగ్రహాలకు పూజలు చేశారు. శివాజీ చౌక్, రామాలయం వీధి నుంచి మున్సిపల్ ఆఫీస్, మున్నూరు గేరి, సయ్యద్ పహాడ్ దర్గా నుంచి సజ్జ ఖాన్ పేట్ దండం చెరువు మార్గాన్ని తనిఖీ చేశారు. చెరువు వద్ద బారికేడ్స్, లైటింగ్ఏర్పాటు చేయాలని, పెద్ద విగ్రహాల కోసం క్రేన్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. సీఐ సైదులు, ఎస్సై లు బాలరాజు, విజయ్ కుమార్ తదితరులున్నారు.
పీస్ కమిటీ సమావేశం
జడ్చర్ల, వెలుగు: పట్టణంలో గణేశ్ నిమజ్జనోత్పవాలు, ఈ నెల 7న మిలాద్‌ఉన్ నబీ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం జడ్చర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో టౌన్ సీఐ కమలా కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. అన్ని కులాలు, మతాలవారు సోదరభావంతో ముందుకు సాగాలని చెప్పారు. మాజీ ప్రజాప్రతినిధులు నిత్యానందం, వెంకటేశం, మాలిక్ షాకీర్, రూరల్ సీఐ నాగార్జున గౌడ్, ఎస్సైలు ఉన్నారు.