స్పెయిన్‌‌‌‌లో రైలు ప్రమాదం.. 39 మంది మృతి

స్పెయిన్‌‌‌‌లో  రైలు ప్రమాదం.. 39 మంది మృతి
  •     159 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం
  •     పట్టాలు తప్పిన హైస్పీడ్‌‌‌‌ రైలు.. మరో రైలు ఢీకొట్టడంతో ఊడిపడ్డ బోగీలు

అదాముజ్‌‌‌‌: దక్షిణ స్పెయిన్‌‌‌‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారుగా 39 మంది మృతి చెందారు. హై స్పీడ్‌‌‌‌ రైలు ఒకటి పట్టాలు తప్పగా.. అదే సమయంలో మరో రైలు ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంలో 159  మంది గాయపడ్డారు. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 7:45 గంటలకు మలగా నుంచి స్పెయిన్‌‌‌‌ రాజధాని మాడ్రిడ్‌‌‌‌కు సుమారు 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న  హై-స్పీడ్ రైలు వెనుక భాగం అదాముజ్ సమీపంలో పట్టాలు తప్పింది. అదే సమయంలో ఎదురుగా మాడ్రిడ్ నుంచి హుయెల్వా పట్టణానికి వెళ్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. రెండో రైలులో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉండగా, ఆ రైలు ముందు భాగం ఈ ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నదని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ప్యూంటె తెలిపారు. రెండో రైలుకు చెందిన మొదటి రెండు కోచ్‌‌‌‌లు పట్టాలు తప్పి, సుమారు  13 అడుగుల లోతున్న లోయలో  పడిపోయాయి. మరణించిన వారిలో ఎక్కువ మంది ఈ కోచ్‌‌‌‌లలో ఉన్నవారేనని ప్యూంటె పేర్కొన్నారు.

24 మందికి తీవ్ర గాయాలు..

ఈ రైలు ప్రమాదంలో 39  మంది మృతిచెందడడంతో ఘటనా స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొన్నది. ప్రమాద సమయంలో రైలులోని కిటికీలు పగులగొట్టుకుని ప్రయాణికులు బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు వైరల్‌‌‌‌గా మారాయి. గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి విషమయంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో 24 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై   స్పెయిన్‌‌‌‌ ప్రధాని పెడ్రో సాంచెజ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.