వరదలు తట్టుకునేలా టవర్ల నిర్మాణం : ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి

వరదలు తట్టుకునేలా టవర్ల నిర్మాణం : ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి

మెదక్​ టౌన్, వెలుగు: భారీ వర్షాలు, వరదలకు తట్టుకునేలా మెదక్​పరిసర ప్రాంతాల్లో విద్యుత్ టవర్లను నిర్మించనున్నట్టు ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ బాల స్వామి తెలిపారు. హల్దీవాగు, పసుపులేరు, పుష్పాల వాగు తదితర ఎనిమిది ప్రాంతాల్లో 25 ప్రత్యేక టవర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. శనివారం ఆయన జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న విద్యుత్ సబ్ స్టేషన్ లు, కొట్టుకుపోయిన ట్రాన్స్ ఫార్మర్ లు, కూలిపోయిన స్తంభాలను పరిశీలించారు. 

అనంతరం మెదక్ లోని విద్యుత్ శాఖ జిల్లా ఆఫీసులో ఎస్ఈ నారాయణ నాయక్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆగస్టు నెలాఖరులో భారీ వర్షాలు కురిసి 115 గ్రామాలకు విద్యుత్​ సరఫరా నిలిచిపోగా అధికార యంత్రాంగం స్పందించి 24 గంటల్లోపే 110 గ్రామాలకు విద్యుత్​ను పునరుద్ధరించిందని తెలిపారు. ఈ విషయంలో ఎస్ఈ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు వారి బాధ్యతలను చిత్త శుద్ధితో నిర్వర్తించారని కొనియాడారు. 

24 గంటల్లోనే 259 స్తంభాలు, 14 విద్యుత్​ డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​ఫార్మర్లు అమర్చడంతో పాటు 11 కిలోమీటర్ల మేర లైన్లు వేసినట్లు  వివరించారు. వ్యవసాయానికి సంబంధించి మరికొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణ జరగాల్సి ఉందన్నారు. ఆ పనులు రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించినట్టు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీఈ స్థాయి అధికారులతో టీమ్​లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఎస్ఈ నారాయణ నాయక్​, మెదక్​, తూప్రాన్​ డీఈలు చాంద్​బాషా, గరుత్మంతరాజు, టెక్నికల్​ డీఈ శ్రీనివాస్​ విజయ్​, ఏడీఈ మోహన్​ బాబు, ఏఈ నవీన్​ ఉన్నారు.