స్టూడెంట్స్‌ సేఫ్టీ కోసం గొంతెత్తండి: రాహుల్ గాంధీ

స్టూడెంట్స్‌ సేఫ్టీ కోసం గొంతెత్తండి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణపై రాద్ధాంతం కొనసాగుతోంది. ఎగ్జామ్స్ నిర్వహించాలని స్టూడెంట్స్‌తోపాటు వారి పేరెంట్స్ కోరుతున్నారని కేంద్రం అంటోంది. విద్యార్థుల రక్షణ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఈ విషయంలో ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ, నీట్‌ను నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా గొంతెత్తాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

‘లక్షలాది స్టూడెంట్స్‌కు మద్దతుగా మీ గొంతుకను వినిపించండి. విద్యార్థుల సేఫ్టీపై ఉదయం 10 గంటల నుంచి గళమెత్తండి. ప్రభుత్వానికి స్టూడెంట్స్ గొంతుక వినిపడేలా చేద్దాం’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఒకవేళ ఈ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు తలెత్తే సమస్యలపై ప్రజా ఉద్యమం చేద్దామంటూ రాహుల్ ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతోందని సదరు వీడియో వాయిస్ ఓవర్‌‌లో వినిపిస్తోంది. స్టూడెంట్స్‌ ఒత్తిడికి గురవుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల తరఫున కాంగ్రెస్ నిలబడుతోందని వీడియోలో కాంగ్రెస్ పేర్కొంది.