
- అర్థవంతమైన చర్చలతోనే ప్రజలకు మేలు జరుగుతది
- జర్నలిస్టులకు కొత్త పాస్‌లు ఇస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, మండలిలో అర్థవంతమైన చర్చల ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇందుకు జర్నలిస్టుల సహకారం ఎంతో ముఖ్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు మీడియా సహకరించాలని కోరారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో గురువారం అసెంబ్లీ మీడియా కమిటీ తొలి మీటింగ్ స్పీకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, సెక్రటరీ నరసింహచార్యులు, మీడియా కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యుడు బుర్రా ఆంజనేయులు గౌడ్‌తో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. కొత్త కమిటీని స్పీకర్, చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాలు ఉన్నా.. లేకున్నా.. శాసన సభ, శాసన మండలి వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాబోయే రోజుల్లో శాసన సభ, మండలి ఒకే భవనంలోకి మారబోతున్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి సహకారం కావాలన్న మీడియా కమిటీ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉభయ సభల నిర్వహణలో జర్నలిస్టుల సహకారం అవసరమని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మీడియా ప్రతినిధులకు అన్ని సౌలత్లు కల్పిస్తామని తెలిపారు. పాస్ ల విషయంలో కమిటీ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. త్వరలోనే కొత్త అసెంబ్లీ పాస్‌లు జారీ చేస్తామని వెల్లడించారు.