నిరుద్యోగ నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

నిరుద్యోగ నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు: నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తక్కువ కాలంలోనే 30 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముందుగా స్పీకర్ ప్రజ్వలన చేసి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అవకాశాలు కల్పిస్తామన్నారు. 

వచ్చే 5 ఏండ్లలో  నిరుద్యోగ సమస్యను తీరుస్తామన్నారు. అనంతరం జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.  70 కంపెనీలు పాల్గొనగా.. అర్హులైన 5 వేల మంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ పి.సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి,  పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి , జిల్లా అదనపు కలెక్టర్ లిగ్యా నాయక్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంత్ రావు, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, టీజీ స్టెప్ మేనేజర్ వేణుగోపాల్ రావు,  జడ్పీ సీఈవో సుధీర్ పాల్గొన్నారు. 

కార్యకర్త కుటుంబానికి భరోసా

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గంగారానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కీ.శే.నర్సింలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను  స్పీకర్ వెళ్లి పరామర్శించారు.  తానున్నానంటూ భరోసా కల్పించి ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఉన్నారు.ధారూర్ కు చెందిన బి.ఆకాంక్షకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో  సీఎంఆర్ఎఫ్ చెక్కును స్పీకర్ అందజేశారు. అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న బంట్వారం మండల కేంద్రానికి చెందిన కె.చంద్రయ్యకు  ముఖ్యమంత్రి సహాయ నిధి కింద  అతని కొడుకుకు రూ. 2. 30 లక్షల ఎల్వోసీని స్పీకర్ అందజేశారు.