3 వేల కోట్లతో వికారాబాద్ జిల్లాను డెవలప్ చేస్తం: గడ్డం ప్రసాద్ కుమార్

3 వేల కోట్లతో వికారాబాద్ జిల్లాను డెవలప్ చేస్తం: గడ్డం ప్రసాద్ కుమార్
  •     అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
     

వికారాబాద్, వెలుగు: రాబోయే ఐదేండ్లలో రూ.3 వేల కోట్లతో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద మూతబడిన బోటింగ్​ను శనివారం ఆయన తిరిగి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చిన హామీ మేరకు కోట్​పల్లిలో బోటింగ్​ను ప్రారంభించామన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా టూరిజంను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని.. దీనివల్ల యువతకు ఉపాధి కల్పించవచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో వికారాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. పాలమూరు – రంగారెడ్డి, ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుల పనులను చేపట్టి పూర్తి చేసి జిల్లాకు సాగు, తాగు నీరందిస్తామన్నారు. లక్నాపూర్, సర్పన్ పల్లి,  నందిగామ ప్రాజెక్టులను సైతం కోట్​పల్లి లాగా అభివృద్ధి చేసి బోటింగ్ సదుపాయం తీసుకొస్తామని ఆయన తెలిపారు. 

కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఇరిగేషన్ ఈఈ సుందర్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, జిల్లా మత్స్యశాఖ అధికారి చరితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.