విపక్షాల ఆందోళన..ఉభయ సభలు రేపటికి వాయిదా

విపక్షాల ఆందోళన..ఉభయ సభలు రేపటికి వాయిదా

పార్లమెంట్ ఉభయసభలు ఆందోళనలతో దద్దరిల్లుతున్నాయి. ద్రవ్యోల్బణం, జీఎస్టీపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. పోడియం ముందుకు వచ్చిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓంబిర్లా సెషన్స్ మొత్తం సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో మాణిక్యం ఠాగూర్, రమ్యా హరిదాస్, జ్యోతిమణి, టీఎన్ ప్రతాపన్ లు ఉన్నారు. అయినా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. పలుసార్లు సభను వాయిదా వేసినా పరిస్థితి మారలేదు. అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాలను పలుసార్లు కోరారు. అర్ధవంతమైన చర్చలు జరిగితేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయన్నారు .ప్రజాస్వామ్య దేవాలయంలో..సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత సభ్యులదేనన్నారు. సభ్యుల ఆందోళనలు విరమించకపోవడంతో స్పీకర్ ఓంబిర్లా సభను రేపటికి(మంగళవారం) వాయిదా వేశారు. ఆగస్టు 12వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.

పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నినాదాలు

సస్పెన్షన్ కు గురైన అనంతరం నలుగురు ఎంపీలు పార్లమెంటు మైదానంలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు. కేంద్రంపై నిప్పులు చెరిగారు. తమ ఎంపీల్లో కొందరిని సస్పెండ్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ మండిపడింది. ప్రజలకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో ప్రశ్నిస్తుంటే కేంద్రం తమ సభ్యుల గొంతు నొక్కేస్తోందని ఆరోపించింది.