- థింక్ ట్యాంక్ ‘సోషల్ కాజ్’ సెమినార్‌లో వక్తలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో ఇటీవల జరిగిన జెనరేషన్ -జెడ్ తిరుగుబాట్లు సుపరిపాలన కోసమే జరిగాయని పౌర సామాజిక థింక్ ట్యాంక్ ‘సోషల్ కాజ్’ ఆదివారం నిర్వహించిన సెమినార్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ తిరుగుబాట్లు అధికార కేంద్రీకరణపై యువత అసంతృప్తిని సూచిస్తున్నాయన్నారు. ‘శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో ప్రభుత్వాల కూల్చివేత - భారతదేశంలో ప్రజాస్వామ్య గణతంత్రానికి పాఠాలు’ అనే అంశంపై జరిగిన ఈ సెమినార్‌లో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఓఎస్డీ డా.ఆర్. రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. సుపరిపాలన లోపాలు, సంస్థల బలహీనత, ప్రజల ప్రాథమిక అవసరాల పట్ల ఉదాసీనత యువతలో అశాంతికి దారితీస్తాయని హెచ్చరించారు. అధికార కేంద్రీకరణ, ప్రజాస్వామ్య చర్చ లేకపోవడం తిరుగుబాట్లకు కారణమవుతుందన్నారు.
ఈ తిరుగుబాట్లు ఆకస్మికంగా ఉండి, ఎక్కువ కాలం నిలవకపోవచ్చని, అయితే మత పునరుజ్జీవనం, మైనారిటీల సమస్యలు భారత జాతీయ భద్రతకు సవాళ్లను సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొలిటియా రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డా.సంజయ్ పులిపాక మాట్లాడుతూ ఇండియా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో 4 బిలియన్ డాలర్ల సాయం చేసిందని, ఇది ప్రపంచ బ్యాంకు చేసినదానికంటే ఎక్కువేనన్నారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ డా. రమేశ్ కన్నెగంటి మాట్లాడుతూ మానవ భద్రతను నిర్లక్ష్యం చేస్తే జాతీయ భద్రతకు సవాలవుతుందని, స్థానిక గొంతులు వినాలన్నారు. మాజీ కాగ్ డైరెక్టర్ సి.హెచ్. వి. సాయి ప్రసాద్, సోషల్ కాజ్ అధ్యక్షుడు డా. దినేష్ కుమార్ మాట్లాడారు.
