V6 News

పాటల యూనివర్సిటీ.. గద్దర్

పాటల యూనివర్సిటీ.. గద్దర్
  • సంస్మరణ సభలో కొనియాడిన వక్తలు 
  • గద్దరన్నకు మరణం లేదు గోరటి 
  • అన్న ఆటాపాట బతికే ఉంటది: విమలక్క 
  • చంపాలనుకున్న తూటానే సెల్యూట్​ చేసింది: జయరాజ్​
  • పాటకు సంకెళ్లు వేయలేరు - అందెశ్రీ

సికింద్రాబాద్, వెలుగు: ప్రజాయుద్ధ నౌక గద్దర్ అంటే ఓ పాటల యూనివర్సిటీ అని వక్తలు కొనియాడారు. ‘‘గద్దర్ ఒక లెజెండ్. ఆయన చనిపోలేదు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు” అని అన్నారు. ప్రొఫెసర్ కాసీం ఆధ్వర్యంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో గద్దర్ సంస్మరణ సభ నిర్వహించారు. ఇందులో గద్దర్ కొడుకు సూర్యం, బిడ్డ వెన్నెల, కవులు, కళాకారులు, రచయితలు, స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ‘‘ఇది గద్దర్ యుగం. గద్దరన్నకు, ఆయన పాటకు మరణం లేదు. ఆటాపాటకు కేరాఫ్ గద్దర్. భాషా సాహిత్యంలో రారాజు గద్దర్” అని కొనియాడారు. జానపదాలను విప్లవ పాటలుగా మలిచిన గొప్ప కవి గద్దర్ అని ప్రొఫెసర్ కాసీం ప్రశంసించారు.

 ‘‘గద్దర్ తెలుగు సాహిత్యానికి యుగ కర్త. ఆయన కొత్త శబ్దాలను తీసుకొచ్చారు. వస్తువులకు ప్రాణం పోశారు” అని అన్నారు. గద్దర్ అన్నది ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల పాట అని విమలక్క అన్నారు. ‘‘గద్దరన్న ఆటాపాట ఎప్పటికీ బతికే ఉంటుంది. పేద ప్రజల ఉద్యమాలు ఉన్నంత కాలం ఆయన పాటలు సజీవంగా ఉంటాయి. గద్దరన్న ఆశయాలను తెలంగాణ ప్రజలు కొనసాగించాలి” అని పిలుపునిచ్చారు. గద్దర్, గోరటి వెంకన్న స్ఫూర్తితోనే తాను ఉద్యమాల్లోకి వచ్చానని ఏపూరి సోమన్న చెప్పారు. అన్యాయంపై తిరుగుబాటు చేసి, ప్రశ్నించేటోళ్లే గద్దర్ అసలైన వారసులు అని అన్నారు. 

పేదల కోసం పోరాడారు: జయరాజ్ 

గద్దర్ ను ఈ ప్రపంచంలో ఎవరితోనూ పోల్చలేమని జయరాజ్ అన్నారు. “గద్దర్.. ఎవరెస్టు శిఖరంలా ఎదిగి, పేదల కోసం పోరాడారు. ఏ తూటాలైతే గద్దర్ ను మట్టుబెట్టాలని చూశాయో.. అవే తూటాలు ఆయనకు సెల్యూట్ చేశాయి” అని చెప్పారు. గద్దర్ మరణించినా, ఆయన ఆటాపాట ఎప్పుడూ ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంటాయని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. 

గద్దర్​తో 50 ఏండ్ల అనుబంధం: నర్సింగరావు 

గద్దర్ ది, తనది 50 ఏండ్ల అనుబంధమని దర్శక, నిర్మాత బి.నర్సింగరావు చెప్పారు. ‘‘గద్దర్ నన్నెప్పుడు డార్లింగ్ అని పిలిచేవారు. 1980లో నిర్మించిన మా భూమి సినిమాలో బండెనక బండి గట్టి.. పదహారు బండ్లుగట్టి పాటను గద్దర్ పాడటమే కాకుండా మొదటిసారి యాక్టింగ్ చేసి ప్రజలను మెప్పించారు. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగింది. గద్దర్, నేను కలిసి అనేక పాటలు రాశాం. ఆయన మృతి.. ఈ సమాజానికి తీరని లోటు” అని అన్నారు. పాటకు సంకెళ్లు వేయలేరని, అది ఎక్కువ కాలం నడవదని అందెశ్రీ అన్నారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, సంధ్య, స్వర్ణ, మధుప్రియ, సురేందర్, యశ్ పాల్, నలిగంటి శరత్, నల్గొండ గద్దర్ తదితరులు పాల్గొన్నారు. 

ఆటాపాటలతో దద్దరిల్లిన ఆడిటోరియం.. 

కవులు, కళాకారుల ఆటాపాటలతో ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియం దద్దరిల్లింది. గద్దర్ రాసిన, పాడిన పాటలను పలువురు పాడుతూ  ఆయనకు నివాళులు అర్పించారు. మధ్యాహ్నం ప్రారంభమైన సభ.. రాత్రి 9 గంటల వరకు కొనసాగింది.

ఎందరికో స్ఫూర్తి: సుద్దాల  

ఎందరో కవులు, కళాకారులు, రచ యితలకు గద్దర్ స్ఫూర్తి అని సుద్దాల అశోక్ తేజ అన్నారు. ‘‘గద్దర్ కేవలం విప్లవ గీతాలకే పరిమితం కాలేదు. సామాజిక చైతన్య గీతాలు రాసి ఎంతోమందిలో ఉత్తేజం నింపారు. గద్దర్ చనిపోలేదు. ఈ లోకానికి వచ్చిపోయారు. ఆయనెప్పుడూ ప్రజల్లోనే ఉంటారు” అని చెప్పారు. ‘‘గద్దర్ చచ్చిపోలె.. పాటల ప్రవాహంలా వచ్చిపోయారు. విప్లవ సందేశాన్ని ఊరూరా తీసుకెళ్లిన మొదటి గాయకుడు గద్దర్” అని అన్నారు. 

నాన్న ఆశయాలు  కొనసాగిస్తం: వెన్నెల 

‘‘మా మార్గం సమతా మార్గం, సమా నత్వం. ఆ బాటలోనే కొనసాగుతాం. మేము నిజాయతీగా, నిక్కచ్చిగా ఉంటాం. మా నాన్న ఆశయాలను కొనసాగిస్తాం” అని గద్దర్ బిడ్డ వెన్నెల చెప్పారు. ‘‘దొర ఏందిరో.. దొర పీకుడేందిరో అని మా నాన్న పాట పాడితే కొంతమంది విమ ర్శించారు. కానీ, మా నాన్న మరణిస్తే  లక్షలాది మంది వచ్చి నివాళులర్పించారు. ఇది చాలదా.. ఆయన గొప్పదనం చెప్పడానికి” అని వెన్నెల అన్నారు.