వీఐపీలు మెచ్చిన విలేజ్‌‌‌‌ చెఫ్‌‌‌‌

వీఐపీలు మెచ్చిన విలేజ్‌‌‌‌ చెఫ్‌‌‌‌

యాదమ్మ చెయ్యి పడితే చాలు.. ఏ వంటకమైనా సూపర్​ హిట్టే. పచ్చిపులుసు పెట్టినా.. భక్షాలు చేసినా.. బగారన్నం వండినా.. చిన్నాపెద్దా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకి తెలంగాణ మెను ఫైనల్​ కాగానే.. యాదమ్మకే మొదట ఫోన్​కాల్​ వెళ్లింది. మోడీకి తన చేతి వంట తినిపించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఎందరో వీఐపీ ఇండ్లలో గరిటె తిప్పుతున్న ఆమె ఒకప్పుడు తినడానికి లేక పడరాని కష్టాలు పడింది. 

యాదమ్మ వంటల తయారీ కోసం కోర్సులు ఏం చేయలేదు. కానీ, ఆమె చేతి వంట తిన్నవాళ్లంతా వందకి నూటొక్క మార్కులేస్తారు. యాదమ్మకి  ఫలానా రోజున వేరొక ఫంక్షన్​ ఉందంటే చాలు, పెండ్లి ముహూర్తాలు కూడా మారతాయంటే ఆమె చేతి ఘుమఘుమలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఎన్నో రకాల వంటలు చేస్తున్నా.. మామిడికాయ, పుంటికూర పప్పు నా సిగ్నేచర్​ డిష్​లు అంటున్న ఆమె గురించి... 

పొట్టకూటి కోసం..

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం గౌరవెల్లిలో పుట్టింది యాదమ్మ.  పదిహేనొవ ఏట పెండ్లయ్యాక కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండా పూర్​కి వచ్చింది. కూలీనాలీ చేసుకుంటూ ఉన్నంతలో  భర్తతో సంతోషంగా ఉందామె. కొడుకు పుట్టాక.. ఆమె సంతోషాలు డబుల్​ అయ్యాయి. కానీ, అంతలోనే ఉహించని ప్రమాదం భర్తని దూరం చేసింది. ఆ గడ్డు పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన అత్తింటి వాళ్లు ముఖం చాటేశారు. దాంతో చేసేదేంలేక మూడు నెలల బిడ్డతో కరీంనగర్​ టౌన్​కు వెళ్లింది. కొద్దిరోజులు తెలిసినవాళ్ల ఇంట్లో తలదాచుకుంది. పొట్టకూటి కోసం అడ్డామీదకి వెళ్ళి తట్ట, పార.. ఇలా ఏ పనికి  పిలిస్తే ఆ పనికి వెళ్లింది. కొన్నాళ్లు స్కూల్​లో ఆయాగా కూడా పనిచేసింది. ఇండ్లలో వంటమనిషిగా చేరింది. ఆ తరువాత పెండ్లిండ్లు, ఫంక్షన్​లకు వంటలు చేసే వెంకన్న మాస్టారు దగ్గర పనికి కుదిరింది. రకరకాల వంటలు చేయడం నేర్చుకుంది. వెంకన్న మాస్టారు ఎంకరేజ్​ చేయడంతో పెండ్లిండ్లు, ఫంక్షన్​లకి వంటలు చేయడం మొదలుపెట్టింది. అవి అందరికీ నచ్చడంతో.. తానే స్వయంగా ఫంక్షన్​లకి ఫుడ్​ ఆర్డర్స్​ తీసుకోవడం మొదలుపెట్టింది. 

నా అదృష్టం

కరీంనగర్​లో ఏ ఫంక్షన్​ జరిగినా.. యాదమ్మ ఉండాల్సిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డెయిరీ ఛైర్మన్ రాజేశ్వర్ రావు.. ఇలా కరీంనగర్​లో వీఐపీల ఫంక్షన్​లకు,  పొలిటికల్​ పార్టీల మీటింగ్​లకు యాదమ్మనే వంట చేస్తుంది. దాదాపుగా ఇరవై వేల మంది భక్తులు వచ్చే మహాశక్తి టెంపుల్ ఉత్సవాలకి కూడా తానే వండుతుంది. ఇప్పుడు ఏకంగా  రేపు, ఎల్లుండి హైదరాబాద్​లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వంట చేయడానికి పిలుపు వచ్చిందామెకి. ఈ సమావేశాల్లో  ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులకు తన చేతి వంట తినిపించబోతోంది యాదమ్మ. సమావేశాలకి బెండకాయ–కాజు పల్లీ ఫ్రై, బీరకాయ‌‌‌‌‌‌‌‌–మిలిమేకర్, ముద్దపప్పు, పచ్చిపులుసు, గంగవాయిల పప్పు లాంటి వెజ్ కర్రీలు... బెల్లపుఅన్నం, సర్వపిండి.. మక్క గుడాలు, జొన్న రొట్టెలు, సకినాలు, పూస, భక్షాలు, ఉల్లి పకోడీ, పంట గారెలు,సేమియా పాయసం చేస్తోంది యాదమ్మ. దేశ ప్రధానికి తెలంగాణ వంటలు రుచి చూపించే అవకాశం దక్కడం నా  అదృష్టం అని చెప్తోంది.

‘‘మూడు పూటలా కడుపునిండితే చాలన్న ఆశతో కరీంనగర్​ వచ్చా. దానికోసం ప్రతిరోజు కష్టపడ్డా..ఆ కష్టమే నన్ను ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నా కొడుకు ఎంబీఏ పూర్తిచేసి, నాతో కలిసి క్యాటరింగ్ బిజినెస్​ చేస్తున్నాడు. ఇల్లు కూడా కట్టుకున్నా. ఇప్పుడు మోడీ సారు కోసం వంట చేసే అవకాశం బండి సంజయ్​ సార్​ ద్వారా వచ్చింది. ఈ విషయం తెలిశాక చాలా మంది ఫోన్లు చేసి.. ‘నీ చేతి వంటతో అందరి మెప్పు పొందాలని’ చెప్తున్నారు.  వాళ్ల ఆశీర్వాదంతో  కరీంనగర్ పేరును నిలబెడతాను’’ అంటోంది యాదమ్మ. 

- యాకయ్య ఓడపల్లి, కరీంనగర్, వెలుగు
ఫొటోలు: కిరణ్ కుమార్ గూడూరు