తెలంగాణ కోసం జైలుకెళ్లిన ఉద్యమ చరితార్థుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి

తెలంగాణ కోసం జైలుకెళ్లిన ఉద్యమ చరితార్థుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి

నమ్మిన కాంగ్రెస్ సిద్ధాంతం కోసం ఎవరికీ తలవంచని ధైర్యశాలి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఆయన 73 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో మొన్న గురువారం కన్నుమూశారు. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన జీవితంలో  రాజకీయ నేపథ్యాన్ని ఈనాటి తరం తెలుసుకోవాలి. రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి కమలాదేవి దంపతులకు 6వ సంతానంగా 14 సెప్టెంబర్ 1952లో  జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం పాత లింగాల గ్రామంలో జరిగింది. అనంతరం హైస్కూలు విద్యాభ్యాసం 12 తరగతి వరుకు ఆంగ్ల మాధ్యమంలో హైదరాబాద్ జామ్ బాగ్ లోని వివేకవర్ధిని మల్టీపర్పస్ స్కూల్ లో పూర్తి చేశారు.  బి.జడ్.సి(BZC) గ్రాడ్యుయేషన్  వరంగల్ ఆర్ట్స్&సైన్స్ కళాశాలలో 1973లో పూర్తి చేశారు.

తెలంగాణ కోసం జైలుకెళ్లారు
వరంగల్​లో డిగ్రీ చదివేటప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమ ప్రభావానికి లోనయ్యారు. తెలంగాణ వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న దామన్న 1969 తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం జైలుకు వెళ్ళారు.1971లో ఆంధ్రులు లేవనెత్తిన జై ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా జై తెలంగాణ అంటూ మరోసారి జైలుకు వెళ్లారు.  వి హనుమంతరావు నాయకత్వంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కోశాధికారిగా నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, దామోదర్ రెడ్డిలు యువజన కాంగ్రెస్​లో కలిసి పనిచేశారు. ఆయన తుంగతుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. సాయుధ పోరాట యోధురాలు సీపీఎం నాయకురాలు అయిన మల్లు స్వరాజ్యాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి 1985 ఎన్నికల్లో ఓడించారు.  తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 1985,1989,1994 ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించారు.1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అయినా ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి కాంగ్రెస్ విధేయుడు గా ఖ్యాతి పొందారు.

తెలంగాణ గొంతు వినిపించిన నేత 
నిజం చెప్పాలంటే, 1989 నుండి 1999 వరకు అసెంబ్లీలో తెలంగాణవాదాన్ని వినిపించిన మొట్టమొదటి నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి నే. దామోదర్ రెడ్డి తన కార్యకర్తలు సుమారు 30వేల మందితో చంద్రబాబు నాయుడు వేసిన శిలాఫలకంపై రక్తం చిందించి శ్రీరాంసాగర్ జలాలను తుంగతుర్తికి నల్గొండకు తెప్పించిన అపర భగీరథుడుగా కీర్తి గడించారు. తర్వాత ఆయన 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. నియోజవర్గాల పునర్విభజన కారణంగా తుంగతుర్తి వదిలి, సూర్యాపేట నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1991–-92లో ఆయన మంత్రీవర్గంలో ఓడరేవులు భూగర్భ జలవనరులశాఖ మంత్రిగా దామోదర్ రెడ్డి పనిచేశారు.

వైఎస్ఆర్ హయాంలో ఐటి&కమ్యూనికేషన్ మంత్రిగా 2008-– 09 వరకు పనిచేశారు. ఆ తర్వాత వరుసగా 2014, 2018, 2023 ఎన్నికల్లో ఓడిపోయినా బలమైన కాంగ్రెస్​ నాయకుడిగా  నిలబడ్డారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి జమీందారు కుటుంబంలో జన్మించినా పేదల పక్షపాతిగా గుర్తింపు పొందారు. పేదల కోసం, దేవాలయాల వితరణకోసం వందల ఎకరాలు కరిగిపోయినా చివరి శ్వాస వరకూ దానధర్మాలు చేసిన ధర్మరాజుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ప్రజలు ఆయన్ను  ‘టైగర్ దామన్న’ అని ముద్దుగా పిలుచుకుంటారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 23 సాయంత్రం మాజీ హోంమంత్రి చిదంబరం తెలంగాణకి వ్యతిరేకంగా ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సందిగ్ధంలో పడేశాడు. దీనికి నిరసనగా నా నాయకత్వంలో మొత్తం 14మంది విద్యార్థులం 24 డిసెంబర్ 2009 ఉదయం ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్షకు దిగాము. ఆనాడు మా దీక్ష వద్దకు టీఆర్ఎస్ నేతల కన్నా ముందుగా వచ్చి  మాకు సంఘీభావం తెలిపిన దమ్మున్న తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యే టైగర్ దామన్ననే. దీక్షలో కూర్చున్న మేము వేలాది మంది విద్యార్థులంతా  దామన్న ను చూసి టైగర్.. టైగర్ అని నినాదాలతో హోరెత్తాము.

దామన్న ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కి తొడగొట్టి మీసం తిప్పి  జై తెలంగాణ అని పెద్దపులిలా గాండ్రించటం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతోంది. 2009 డిసెంబర్ 24న జానారెడ్డి, కేసీఆర్, దత్తాత్రేయలు కలిసి ఆచార్య కోదండరామ్ నేతృత్వంలో పొలిటికల్ జెఏసీ ఏర్పాటులో దామన్న క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దామన్న పాత్ర అజరామరం. ఆయన ఆకారం గంభీరంగా ఉన్నా, ఆయన మనసు నిండా మాత్రం మానవత్వం నిండి ఉండేది. మహోన్నత వ్యక్తిత్వం ఉన్న నిఖార్సైన  తెలంగాణ ఉద్యమ కారుడైన టైగర్ దామన్నకి మనమంతా జోహార్లు పలుకుదాం. 

కోటూరి మానవతారాయ్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి