
- సిటీలో ఉంటున్న వారి వివరాలతో నిఘా
- అధికారికంగా 184 మంది నివాసం
- జైలులో మరో ముగ్గురు
- ఇద్దరికి శిక్ష ముగిసినా డిపోర్షన్ ఆర్డర్ రాలేదు
- అక్రమంగా చొరబడ్డ వారి వివరాలు సేకరిస్తున్న ఎస్‌బీ, ఐబీ
హైదరాబాద్,వెలుగు: పాతబస్తీలో పాకిస్తాన్ యువకుడు మహ్మద్ ఫయాజ్ అక్రమ నివాసం ఘటనతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. భార్య కోసం వచ్చి ఓల్డ్‌సిటీ కిషన్‌బాగ్‌లో అక్రమంగా ఉంటున్న ఫయాజ్‌ను గత నెల 30న బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కిషన్‌బాగ్‌కు చెందిన నేహా ఫాతిమా(19)ని పాకిస్థాన్ షంగత్ జిల్లా స్వత్‌గ్రామానికి చెందిన ఫయాజ్ 2018లో షార్జాలో పెండ్లి చేసుకున్నాడు. మూడేండ్ల బాబుతో కలిసి నేహా ఫాతిమా హైదరాబాద్ వచ్చింది.
దీంతో ఆమె తల్లిదండ్రులు ఫయాజ్‌ను ఎలాంటి వీసా లేకుండానే బోర్డర్ దాటించి హైదరాబాద్ తీసుకొచ్చారు. దీంతో నవంబర్ నుంచి ఫయాజ్ అక్రమంగా సిటీలో ఉంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఫయాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కస్టడీకి తీసుకుని విచారించారు. చైనా మీదుగా నేపాల్ వచ్చి అక్రమంగా ఇండో నేపాల్ బోర్డర్ దాటినట్లు గుర్తించారు. ఫయాజ్ తరహాలోనే ఎవరైనా అక్రమంగా నివాసం ఉంటున్నారా అనే వివరాలను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సేకరిస్తున్నారు. పోలీస్ రికార్డుల ప్రకారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం184 మంది పాకిస్థాన్‌కు చెందిన వారు నివాసం ఉంటున్నారు.
వీరందరికీ అధికారిక పాస్‌పోర్ట్, వీసాలు ఉన్నాయి. విద్య, ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారం పనులపై హైదరాబాద్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. వీరిపై కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిఘా పెట్టారు.స్థానిక పోలీసులతో ఎప్పటికప్పుడు సమాచారం రాబడుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారి కాంటాక్ట్స్, బంధువుల వివరాలను స్పెషల్ బ్రాంచ్ సేకరించింది. ఇమ్మిగ్రేషన్ సహకారంతో పాకిస్థాన్‌కు ట్రావెల్ చేసిన వారి వివరాలను రికార్డ్ చేస్తున్నది.
శిక్షాకాలం ముగిసినా జైలులోనే..
ఫయాజ్ అక్రమ చొరబాటు, ఇండో నేపాల్ బోర్డర్‌లో సెక్యూరిటీ లోపాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందించారు. జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న విదేశీయుల వివరాలు సేకరించారు. రాష్ట్రలోని జైళ్లలో ఇప్పటికే 40 మంది విదేశీయులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు పాకిస్థానీయులు నజీర్,ఉస్మాన్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వీరితో పాటు ఫయాజ్ కూడ ప్రస్తుతం జైలుకెళ్లాడు. నజీర్‌కు 2019లో శిక్షా కాలం ముగిసింది. ఉస్మాన్‌కు నాలుగు నెలల క్రితం శిక్ష ముగిసింది. అయితే, వీరికి ఇప్పటి వరకు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు డిపోర్షన్ ఆర్డర్ రాలేదు. దీంతో జైలులోనే ఉన్నారు.