జ్వరాలపై జాగ్రత్త..కేసులు పెరిగితే వెంటనే చెప్పాలె

జ్వరాలపై జాగ్రత్త..కేసులు పెరిగితే వెంటనే చెప్పాలె

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ర్టంలో ఎక్కడైనా జ్వరం, జలుబు కేసులు పెరిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. లాక్‌‌డౌన్ తర్వాత  తీసుకోవాల్సిన చర్యలపై శనివారం గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. లాక్‌‌డౌన్ తర్వాత ఉండే పరిస్థితులకు అనుగుణంగా దవాఖాన్లను సిద్ధం చేయాలన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో వచ్చేవారి కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వలస కూలీలు, జబ్బులున్నోళ్లు, వృద్ధులు, పిల్లలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారు. సిటీల్లో సర్వైలెన్స్‌‌పై ఫోకస్ చేయాలన్నారు.

పీహెచ్ సీలకు సూచనలివీ… 

ప్రతి పీహెచ్‌‌సీలో దగ్గు, జలుబు, జ్వరం (ఐఎల్‌‌ఐ)తో వచ్చే వారి కోసం స్పెషల్ ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. వీరు హాస్పిటల్ లో వెయిట్ చేసేందుకు ప్రత్యేకంగా జాగా కేటాయించాలి. డాక్టర్లు, సిబ్బంది మాస్క్, గ్లౌజులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఒక్కో పేషెంట్‌‌ను పరిశీలించిన ప్రతిసారీ స్టెతస్కోప్, థర్మామీటర్‌‌‌‌, బీపీ మిషన్ ను డిసిన్ఫెక్టెంట్స్ తో క్లీన్ చేయాలి. ప్రతిరోజూ రెండుసార్లు పీహెచ్ సీలో శానిటైజేషన్ చేయాలి. ఐఎల్‌‌ఐ, సారి కేసులు పెరిగితే డీఎంహెచ్‌‌వోకు, కలెక్టర్‌‌‌‌కు వెంటనే సమాచారం ఇవ్వాలి.

ఫీల్డ్‌‌ లెవల్‌‌ సర్వైలెన్స్‌‌ ఇట్ల…

ప్రతి ఏఎన్‌‌ఎం, ఆశ కార్యకర్త తమ పరిధిలో ఎవరైనా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారో గుర్తించి పీహెచ్ సీకి పంపించాలి. క్వారంటైన్ లో ఉన్న వలస కూలీలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే అధికారులకు చెప్పాలి. మెడికల్ ఆఫీసర్లు రోజూ ఏఎన్ ఎంలతో మాట్లాడి జ్వరం కేసులపై ఆరా తీయాలి. డీఎంహెచ్‌‌వోలు ప్రతిరోజు మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పరిస్థితిని సమీక్షించాలి. గ్రేటర్‌‌‌‌లోని బస్తీ దవాఖానాలు, యూపీహెచ్ సీలు ఏరోజుకారోజు ఫీవర్ కేసుల సంఖ్యను ఉన్నతాధికారులకు చెప్పాలి. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు ప్రతిరోజు పేషెంట్ల వివరాలను ఈ–బర్త్ పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేయాలి.

ఫ్రీగా మాస్కులియ్యాలె

షుగర్, బీపీ, టీబీ పేషెంట్లు, వృద్ధులపై కరోనా ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీరు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి రెండు క్లాత్‌‌ మాస్కులు ఉచితంగా అందజేయాలి. వీళ్లకు ఇంటి దగ్గరికే వెళ్లి బీపీ, షుగర్ టెస్టులు చేయాలి. ఒక్క నెలకు సరిపడా మందులు అడ్వాన్స్‌‌గా ఇవ్వాలి.

కేసులు ఎక్కువైతే కష్టం:ఎర్రబెల్లి

‘ఒక‌వైపు క‌రోనా ఇంకా మ‌న‌తోనే ఉంది. మ‌రోవైపు సీజ‌న‌ల్ వ్యాధులు ప్రబ‌లే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. క‌రోనా ప్రబ‌లితే క‌ష్టకాలం వ‌స్తుంది” అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ప‌ల్లె ప్రగ‌తి స్ఫూర్తితో సీజ‌న్ వ్యాధుల‌ను అరిక‌డ‌దామని పిలుపునిచ్చారు. దోమ‌లు పెర‌గ‌కుండా ముందుగానే జాగ్రత్త చ‌ర్యలు చే‌పడ‌దామన్నారు. ప్రజ‌ల్లో వ్యక్తిగ‌త ప‌రిశుభ్రత‌పై అవ‌గాహ‌న పెంచాలని అధికారులను కోరారు. సీజ‌న‌ల్ వ్యాధులు, నివార‌ణ చ‌ర్యలపై అన్ని జిల్లాల జ‌డ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జిల్లా కలెక్టర్లు, అద‌న‌పు క‌లెక్టర్లు, డీఆర్డీఓలు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీఓలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

లింక్ దొరకట్లే..సవాల్ గా మారుతున్న కరోనా కాంటాక్ట్ లు