
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు గొర్రెల కొనుగోలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గొర్రెకు జియో ట్యాగింగ్, బీమా చేస్తామని కలెక్టర్ శరత్ తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీపై సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో పశుసంవర్థక శాఖ , నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గొర్రెల రవాణాకు ‘ఈ టెండర్ ప్రక్రియ’ను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. రెండవ విడత లబ్ధిదారుల జాబితా పరిశీలించి, ఎవరైనా మరణించి ఉంటే నామిని వివరాలు సేకరించాలని ఆదేశించారు. ప్రభుత్వం గొర్రెల యూనిట్ వ్యయాన్ని రూ. 1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు పెంచిందని, వీటిలో 25 శాతం(రూ.43,750 ) లబ్ధిదారుడి వాటా, మిగితాది ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందన్నారు. ఇందులో లబ్ధిదారుడి వాటా సేకరణ కోసం మండల స్థాయిలో గొల్ల కుర్మ సంఘాల ఆధ్వర్యంలో మీటింగ్‌లు పెట్టి అవగాహన కల్పించాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పశు సంవర్థక శాఖ జేడీ వసంత కుమారి, ఏడీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మహిళా ఆరోగ్య కేంద్రాలపై ప్రచారం చేయండి
మహిళా ఆరోగ్య కేంద్రాలు, కంటివెలుగుపై గ్రామాల్లో ప్రచారం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లు, ఎంపీవోలు, ఏపీవోలు, ఏపీడీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కేంద్రాలను మహిళలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జీవో 58, 59 కింద జూన్2, 2020 వరకు ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలో ఉన్నవారు ఈ నెల 30 వరకు మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. ఉపాధి హామీ కింద నమోదైన కూలీల్లో కనీసం 50 శాతం మంది పనికి హాజరయ్యేలా చూడాలన్నారు. నర్సరీల్లో వంద శాతం జర్మినేషన్ వచ్చేలా కృషి చేయాలని లేదంటే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జడ్పీ సీఈవో ఎల్లయ్య, డిఎఫ్‌వో శ్రీధర్ రావ్, డీఎంహెచ్‌వో డా.గాయత్రీ దేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పంచవటి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం
నారాయణ్ ఖేడ్, వెలుగు: పంచవటి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ శరత్ తెలిపారు. సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి న్యాల్‌కల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాఘవపూర్ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజీరాలో ఐదేళ్లకోసారి జరిగే పుష్కరాలు ఈ నెల 24న ప్రారంభమై మే 5 వరకు కొనసాగుతాయన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతాయని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.