చేనేత లక్ష్మి స్కీమ్ లో చేరితే.. భారీగా రాయితీ

చేనేత లక్ష్మి స్కీమ్ లో చేరితే.. భారీగా రాయితీ
  • నిర్వహణ బాధ్యతలు టెస్కో కు అప్పగించిన ప్రభుత్వం
  • ఆసక్తి ఉన్నవారెవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు 
  • వస్త్రాల కొనుగోలుపై 60 శాతం రాయితీ వర్తింపు
  • రాష్ట్రవ్యాపంగా 32 చేనేత క్లాత్ షోరూంలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: “చేనేత లక్ష్మి”లో చేరండి.. నేతలన్నలకు చేయూతను ఇవ్వండి’’ అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ ప్రారంభించింది.  చేనేత రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘చేనేత లక్ష్మి’ని అమలులోకి తెచ్చింది. ఆసక్తి ఉన్న ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు ఎవరైనా కానీ చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తే భారీగా రాయితీ కల్పిస్తోంది. తద్వారా చేనేత వస్త్రాల కొనుగోలు పెరిగితే నేతన్నలు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ ను చేపట్టింది.  

టెస్కో ఆధ్వర్యంలో నిర్వహణ

రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతను టెస్కోకు అప్పగించింది. ఈ స్కీమ్ లో చేరినవారికి భారీగా రాయితీలను ఇస్తోంది. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు ఇలా అన్నివర్గాల ప్రజలను స్కీమ్ లో చేర్చుకునేందుకు  టెస్కో విస్త్రృతంగా ప్రచారం చేస్తోంది. ఆసక్తి కలిగివారు చేరొచ్చు. ఇందుకు నెలకు రూ.500 చొప్పున 9 నెలలు మొత్తం 4500 చెల్లిస్తే చాలు.. రూ.7,200 విలువైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు. తద్వారా 60 శాతం రాయితీ పొందొచ్చు. అదేవిధంగా 5 నెలల చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా షోరూంల ఏర్పాటు

టెస్కో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 32 చేనేత వస్త్రాల షోరూంలను ప్రారంభించినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6  షోరూంలను ఏర్పాటు చేశారు.  కరీంనగర్, మెట్ పల్లి, జగిత్యాల, వేములవాడ, గోదావరి ఖని టౌన్లలోనూ ఇవి ఉన్నాయి. ప్రత్యేకంగా సిరిసిల్ల కలెక్టరేట్ లో చేనేత వస్త్రాల స్టాల్ ను ప్రారంభించారు. ప్రతి సోమవారం ప్రజావాణి సందర్భంగా స్టాల్ లో వస్త్రాల అమ్మకాలు నిర్వహిస్తున్నారు.

చేనేతను ఆదరించేందుకు..

ప్రస్తుత కాలంలో మరమగ్గాలపై ఎక్కువగా పాలిస్టర్ వస్త్రాల ఉత్పత్తులు పెరిగిపోతుండడంతో  చేనేత రంగం కుదేలవుతోంది. చేనేత వస్త్రాల కొనుగోళ్లు కూడా తగ్గిపోయాయి. ఒకప్పుడు సిరిసిల్ల చేనేత వస్త్రాలకు  పేరుగాంచింది. వేల మగ్గాలు ఉండేవి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ లో 31 చేనేత సంఘాలు,1,052 మగ్గాలు ఉన్నాయి. వీటిలో కేవలం 1,524 మంది చేనేత కార్మికులు మాత్రమే పని చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ద్వారా చేనేత వస్త్రాలకు ఆదరణ పెరగనుంది.  తద్వారా చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తోంది.

కొనుగోలుపై 50 - 60 శాతం రాయితీ 

చేనేత లక్ష్మి స్కీమ్ లో ఆసక్తి ఉన్నవారెవరైనా చేరవచ్చు. ఇందులో చేరినవారికి చేనేత వస్త్రాల కొనుగోలుపై 50 నుంచి 60 శాతం వరకు రాయితీ లభిస్తోంది. గతంలో కలెక్టర్ తో పాటు, ప్రభుత్వ ఉద్యోగులు విధిగా ఈ స్కీమ్​లో చేరారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా స్కీమ్​లో జాయిన్ చేసేందుకు వెయ్యి మందిని టార్గెట్ గా పెట్టుకున్నాం. ప్రజలు కూడా స్పందించి చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగాన్ని ఆదరించాలి.      

- కుసుమ విజయ్ కుమార్, టెస్కో మేనేజర్, రాజన్న సిరిసిల్ల జిల్లా

దసరాకు ఫ్యామిలీ అంతా బట్టలు కొంటాం 

చేనేత లక్ష్మి స్కీమ్ లో చేరి.. నెలకు రూ. 1,000 చొప్పున తొమ్మిది నెలలు చెల్లించాను. వచ్చే దసరా పండుగకు కుటుంబమంతా బట్టలు కొంటాం. ఇక్కత్, ధర్మవరం, కంచి పట్టు చీరలు తక్కువ ధరల్లో దొరుకుతాయి. 60 శాతం రాయితీ ఉండడంతో ఎక్కువ వస్త్రాలను కొనుగోలు చేయొచ్చు.  ఈ స్కీమ్ ఉపయోగంగా ఉండి చాలా బాగుంది.  - పులి రవి గౌడ్, వేములవాడ టౌన్