
- హుజూరాబాద్ బైపోల్ తర్వాత రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్
- మునుగోడులోనూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలని కోరుకుంటున్న జనం
- హుజూరాబాద్ లెక్క తమకు ఫండ్స్ వస్తాయనే ఆశ
- ఆఫీసర్లు రాత్రికిరాత్రే రోడ్లేస్తరని, డ్రైనేజీలు కడ్తరనే భావన
- లీడర్లు పైసలు, స్కీములు, దావత్‌లు ఇస్తారని చెప్తున్న ఓటర్లు
వెలుగు, నెట్‌వర్క్: రాష్ట్రంలో తమ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందంటే చాలు అక్కడి జనం సంబురపడుతున్నారు. దేశంలోనే అత్యంత భారీ ఖర్చుతో జరిగిన హుజూరాబాద్ బై ఎలక్షన్ తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు తమ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలని, తమకూ బై ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నారు. అప్పుడే తమ నియోజకవర్గంలో సర్కారు పెద్ద మొత్తంలో ఫండ్స్ ఖర్చు చేస్తుందని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ తమ ఊరి వైపు కన్నెత్తి చూడని ఆఫీసర్లు, లీడర్లు తమ ఇంటికే వచ్చి ఏమి కావాలో తెలుసుకొని మరీ ఇస్తారని, తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని అనుకుంటున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్‌తో పాటు తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జోరందుకోవడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. స్థానిక ప్రజలతోపాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజీనామా చేసిన మరుక్షణం నుంచి తమ నియోజకవర్గానికి పండుగ మొదలైతదని, తమకు వ్యక్తిగత ప్రయోజనాలతోపాటు నియోజకవర్గంలోని పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని చెప్పుకుంటున్నారు. రాత్రికి రాత్రే రోడ్లు వేస్తారని, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు కడ్తారని, కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, గొర్రెలు, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇలా అన్ని స్కీములు ఇస్తారని ఆశపడ్తున్నరు. ఇన్నిరోజులు ముఖం చాటేసిన ప్రజాప్రతినిధులు కూడా తమను వెతుక్కుంటూ వస్తారని, అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు పోటీపడి మరీ ఓటు కింత అని పంచుతారని, మందు, విందులతో దావత్‌లు ఇస్తారని కూడా కొందరు చర్చించుకుంటున్నారు.
ఎలక్షన్ టైంలో హుజూరాబాద్‌కు పైసలే పైసలు
మునుగోడుతో పాటు రాష్ట్ర ప్రజలంతా తమ నియోజకవర్గంలో ఎన్నికలు రావాలని కోరుకోవడానికి గతేడాది అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్ బై ఎలక్షనే కారణం. అవి దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచిపోయాయి. అప్పటికే దుబ్బాకలో ఎదురుదెబ్బ తినడంతో టీఆర్ఎస్ పార్టీని హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలిపించాలనే పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ఆ నియోజకవర్గంలో నిధుల వరద పారించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏ నియోజకవర్గానికి ఇవ్వని స్థాయిలో హుజూరాబాద్‌కు రూ.4,200 కోట్లకు పైగా ఫండ్స్ఇచ్చారు.
- నియోజకవర్గంలో ఉన్న 45 వేల ఎస్సీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని దళితబంధు స్కీం తెచ్చారు. అంతకుముందు ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళితబంధు అమలుచేస్తానన్న సీఎం.. హుజూరాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పూర్తిస్థాయిలో అమలుచేశారు. ఇందుకోసం ఏకంగా రూ.2,200 కోట్లు రిలీజ్చేసి 23 వేల మంది ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు.
- కొత్త ఆసరా పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా15 లక్షల దాకా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంటే ఒక్క హుజూరాబాద్‌లో మాత్రమే సుమారు 10 వేల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు. కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడంతోపాటు పెండింగ్‌లో ఉన్న డబుల్బెడ్రూం ఇండ్లను పూర్తి చేయించారు.
- రాష్ట్రంలో ఐకేపీ మహిళలకు సుమారు రూ.3 వేల కోట్లకు పైగా మిత్తి పైసలను సర్కారు బకాయిపడింది. కానీ హుజూరాబాద్‌లో మాత్రం రూ.120 కోట్లను అక్కడి మహిళల ఖాతాల్లో జమ చేసింది.
- సాగర్ బై ఎలక్షన్స్ టైంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టిన ప్రభుత్వం.. హుజూరాబాద్‌లోనే పూర్తిస్థాయిలో ఆ స్కీం అమలుచేసింది. రూ.80 కోట్లతో ఇక్కడి గొల్లకురుమలకు పెండింగ్‌లో ఉన్న 2,874 యూనిట్లను పంపిణీ చేసింది.
- అధికారులంతా నియోజకవర్గంలోనే తిష్టవేసి రాత్రికిరాత్రే రోడ్లు వేయించారు. అవసరమున్నా లేకున్నా డ్రైనేజీలు కట్టించారు.
- లీడర్లు ప్రతి ఊరూ తిరుగుతూ కుల సంఘాలకు స్థలాలు, కమ్యూనిటీ భవనాలు మంజూరు చేశారు. కేవలం ఆత్మగౌరవ భవనాల కోసమే రూ.20 కోట్లు ఖర్చుపెట్టారు.
ఒక్కో ఓటుకు రూ.6 వేల నుంచి 10 వేలు
హుజూరాబాద్ సెగ్మెంట్‌లో పోలింగ్‌కు రెండు, మూడు నెలల ముందే అన్ని పార్టీల లీడర్లు అక్కడ వాలిపోయారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు మండలాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఇతర ముఖ్య నేతలను ఇన్చార్జిలుగా వేయడంతో అక్కడే ఇండ్లు రెంటుకు తీసుకొని అనుచరులతో కలిసి గల్లీగల్లీ తిరిగారు. అధికార పార్టీ లీడర్లయితే ప్రతి ఇంటికీ వెళ్లి ఏ సమస్య ఉందో అడిగి తెలుసుకొని మరీ పరిష్కరించారు. రేషన్‌కార్డు, పింఛన్లు ఇప్పించారు. పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు తెప్పించి మరీ పంచారు. కుల సంఘాల వారీగా మీటింగులు పెట్టి ఆయా సామాజికవర్గాలకు చెందిన మంత్రులను రప్పించి, వాళ్ల చేతుల మీదుగా కమ్యూనిటీ హాళ్లకు జాగలు, భవనాల కోసం ఫండ్స్ ఇప్పించారు. ఎన్నికలు జరిగేదాకా అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ఊరూరా మందు, మటన్, చికెన్‌తో దావత్‌లు ఏర్పాటు చేశాయి. లక్షల కోళ్లు, వేల గొర్రెలు, మేకలు తెగాయి. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రధాన పార్టీలు ఓటుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా పంచాయి.
లోకల్ లీడర్లకూ మస్తు డిమాండ్
బై ఎలక్షన్ నేపథ్యంలో హుజూరాబాద్నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లింక్ రోడ్లకు రూ.220 కోట్లు, మండల, జిల్లా పరిషత్‌లకూ సుమారు రూ.200 కోట్ల దాకా ఫండ్స్ ఇచ్చారు. మెజారిటీ పనులను స్థానిక ప్రజాప్రతినిధులకే అప్పగించారు. ఎలక్షన్ టైంలో నేతలకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. పార్టీ మారితే చాలు, పైసలు, పదవులు వచ్చిపడ్డాయి. నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మేజర్ గ్రామాల్లోని సర్పంచులను సీఎం కేసీఆర్ ఏకంగా ప్రగతిభవన్‌కు పిలిచి లంచ్ మీటింగ్ పెట్టి.. వాళ్లు అడిగిన వర్క్స్ శాంక్షన్ చేయించారు. నామినేటెడ్ పదవులన్నీ హుజూరాబాద్ నియోజకవర్గానికే పంచిపెట్టారు. ఈటల వెంట ఉన్న లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు పదవులు ఎరవేశారు. కాంగ్రెస్ లీడర్ పాడి కౌశిక్ రెడ్డిని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణను టీఆర్ఎస్‌లో చేర్చుకొని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవులను అక్కడి లీడర్లకే కట్టబెట్టారు.
మునుగోడు ప్రజలు ఏం కోరుకుంటున్నరంటే..
- నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టలేదు. 850 ఇండ్లకు టెండర్లు పిలిస్తే కేవలం 100 ఇండ్ల నిర్మాణానికే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. అందులోనూ ఒక్క దానికీ పని స్టార్ట్ కాలేదు. ఎన్నికలు వస్తే తమకు డబుల్బెడ్రూం ఇండ్లు వస్తాయని జనం అనుకుంటున్నారు.
- కొత్త పింఛన్ల కోసం నియోజకవర్గంలో 4,413 మంది అప్లై చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇక 57 ఏండ్ల అర్హత కలిగిన వాళ్లు ఇంతకు రెండింతలు ఉంటారు.
- మర్రిగూడ మండలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కట్టి మూడేండ్లయినా ఓపెన్చేయలేదు. ఒకవేళ ఎన్నికలు వస్తే ఈ 30 బెడ్స్హాస్పిటల్ ఓపెన్‌చేసి, డాక్టర్లను ఇస్తారని జనం అనుకుంటున్నారు.
- ఫండ్స్ రాక ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. చౌటుప్పుల్, మునుగోడు మధ్య రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి. మునుగోడు - నారాయణ్‌పూర్ మధ్య రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. నాంపల్లి నుంచి చండూరు మీదుగా ప్రవహించే శేషిలేటి వాగుపై వంతెన ప్రతిపాదనలకే పరిమితమైంది.
- మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో నిర్మిస్తున్న కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల కింద సాగుభూములు కోల్పోతున్న ముంపు బాధితులకు నష్టపరిహారం కింద రూ.44 కోట్ల దాకా సర్కారు బాకీ పడింది. ఇండ్లు కోల్పోతున్న వాళ్లకు పరిహారం ఇవ్వలేదు. శివన్నగూడెం నిర్వాసితులకు పునరావాసంపై క్లారిటీ లేదు.
- సాగర్ బై ఎలక్షన్ టైంలో జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.20 లక్షలు, మండల కేంద్రానికి రూ.30 లక్షల చొప్పున సీడీఎఫ్ఫండ్స్ ఇస్తామని సీఎం ప్రకటించారు. ఈ లెక్కన మునుగోడు నియోజకవర్గంలోని 159 గ్రామాలు, ఆరు మండలాలకు కలిపి మొత్తం రూ.33.6 కోట్లు రావాలి.
లోన్లు వస్తయ్
మునుగోడులో పండ్లు అమ్ముకుని బతుకుతున్న. బ్యాంకు లోన్ కోసం ఎన్ని సార్లు తిరిగినా ఇవ్వలేదు. ఎలక్షన్ జరిగితే సర్కారు లోన్లు వస్తయని అనుకుంటున్న. కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా వస్తయ్.
ఉప్పురబోయిన ఆండాలు,
మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలె
శివన్నగూడెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోతే ఎకరానికి రూ.4.15 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నరు. కానీ అవి సొంత ఇల్లు కట్టుకోవడానికి సరిపోవు. మాకు న్యాయం జరగాలంటే మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలె.
- పొలగోని జయమ్మ, నర్సిరెడ్డిగూడెం
దళితబంధు వస్తది
మా నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్న. ఎన్నికలు వస్తేనే హుజూరాబాద్ లెక్క మా దళితులందరికీ దళితబంధు వస్తది. మునుగోడులో జూనియర్ కాలేజీ లేదు. ఎప్పటి నుంచో అడుగుతున్నా పెట్టుతలే. ఎన్నికలొస్తే కాలేజీ కూడా వస్తది. అధ్వానంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీల రిపేర్లకు నిధులు వస్తయ్.
‑ పి.రవితేజ, మునుగోడు
ఇల్లు, పింఛన్ వస్తయ్
రిజర్వాయర్ కింద ఉన్న మూడెకరాల భూమి, ఇల్లు పోయినయ్. ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏండ్లు గడిచిపోతున్నయ్. భూమి పోతే పోయింది.. గీత కార్మికుల పింఛన్ అయినా వస్తదని అనుకున్నా. పింఛన్ కోసం ఏడేండ్ల కింద అప్లై చేసుకున్నా ఇప్పటికీ రాలే. మళ్లీ ఎన్నికలు వస్తే ఇల్లు, పింఛన్ వస్తయని ఆశపడ్తున్న.
‑ లోడే యాదయ్య, నర్సిరెడ్డిగూడెం, మునుగోడు