ఆరు జిల్లాల్లో పల్స్ పోలియో.. అక్టోబర్ 12న పోలియో బూత్‌లలో.. 13, 14న ఇంటింటికీ తిరిగి..

ఆరు జిల్లాల్లో పల్స్ పోలియో.. అక్టోబర్ 12న పోలియో బూత్‌లలో.. 13, 14న ఇంటింటికీ తిరిగి..
  • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌లో స్పెషల్ డ్రైవ్ 
  • ఈ నెల 12న పోలియో బూత్‌లలో.. 13, 14న ఇంటింటికీ తిరిగి
  • పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్ తదితర దేశాల్లో పోలియో కేసులు 
  • ఆయా దేశాల నుంచి వలసలు ఉండే జిల్లాలను గుర్తించి డ్రైవ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే (ఎస్ఎన్ఐడీ)ను పురస్కరించుకుని ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఐదేండ్ల లోపు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయనుంది. ఈ స్పెషల్ డ్రైవ్ కోసం హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆరు జిల్లాలను ఎంపిక చేశారు. అర్బన్, మైగ్రెంట్ పాపులేషన్ ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హెల్త్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, లేబర్, ట్రైబల్ తదితర డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లతో సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చారు. 

దేశవ్యాప్తంగా 290 జిల్లాలు..  
దేశంలో 2014 నుంచి ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. మన రాష్ట్రంలో 2007లో చివరి కేసు నమోదైంది. మళ్లీ పోలియో కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం ప్రతి ఏటా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ ఏడాది కూడా ఇప్పటికే పల్స్ పోలియో ప్రోగ్రామ్ నిర్వహించారు. అయితే గత మూడేండ్లుగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్, మోజాంబిక్, మాలావి తదితర దేశాల్లో పోలియో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 29 కేసులు, అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 కేసులు నమోదయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఆయా దేశాల నుంచి వైరస్ వ్యాప్తి జరగకుండా కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది.

ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి మన దేశానికి రాకపోకలు జరుగుతున్న జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఆయా దేశాల నుంచి రాకపోకలు జరిగే 290 జిల్లాలను ఎంపిక చేయగా.. అందులో మన రాష్ట్రం నుంచి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5 జిల్లాలు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ) ఉన్నాయి. వీటితో పాటు వరంగల్ జిల్లా పరిధిలోని అర్బన్ ఏరియాలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 

17 లక్షల మందికి పైగా పిల్లలు..
ఈ స్పెషల్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా మొత్తం 17,32,171 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని సర్కార్ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంది. ఇందుకోసం ఆరు జిల్లాల పరిధిలో 8,662 పోలియో బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 138 ట్రాన్సిట్ పాయింట్లు, 259 మొబైల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టులతో పాటు జనసమూహాలు ఎక్కువగా ఉండే ఈ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 34,648 మంది వ్యాక్సినేటర్లు, 576 మంది సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైజర్లు పాల్గొనున్నారు. పిల్లలకు వేసేందుకు 21.74 లక్షల బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (బీఓపీవీ) డోసులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

అక్టోబర్ 12న (ఆదివారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లలో పోలియో చుక్కలు వేయనున్నారు. ఆ తర్వాత 13, 14 తేదీల్లో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు రాలేని పిల్లలను గుర్తించి డ్రాప్స్ వేస్తారు. ముఖ్యంగా వలస కార్మికులు, ఇటుక బట్టీలు, కన్ స్ట్రక్షన్ ఏరియాల్లో నివసించే వారి పిల్లలు మిస్ కాకుండా స్పెషల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. అవసరమైతే హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో 15వ తేదీ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.