పోలీస్ ఆఫీసర్ పాత్రలకు "ఐ" కాన్ సురేష్ గోపి

పోలీస్ ఆఫీసర్ పాత్రలకు "ఐ" కాన్  సురేష్ గోపి

పవర్‌‌ఫుల్ పాత్రలకి ఆయన ఫేమస్. పోలీస్ క్యారెక్టర్స్ కి ఆయన కేరాఫ్. తూటాలు పేల్చినట్టు డైలాగ్ చెప్పడం.. కంటి చూపుతోనే విలన్ లను కంగారు పెట్టడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. బేసిగ్గా మలయాళ నటుడే అయినా.. తెలుగులోనూ తన సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కెరీర్‌‌ ప్రారంభించి యాభయ్యేళ్లు దాటినా..  ఇప్పటికీ అదే జోష్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్‌‌టైన్ చేస్తున్నారు. ఆయనే ఒన్‌ అండ్ ఓన్లీ.. సురేష్‌ గోపి. జూన్ 26న ఆయన పుట్టినరోజు సందర్భంగా సురేష్ గోపి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు...

కెరీర్ స్టార్టింగ్‌లో విలన్ పాత్రలు, సపోర్టింగ్ రోల్సే..

1958లో కేరళలోని కొల్లంలో సురేష్ గోపి పుట్టారు. తండ్రి గోపీనాథన్ పిళ్లై ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌‌. తల్లి జ్ఞానలక్ష్మి.. గృహిణి. ఆయనకి ముగ్గురు తమ్ముళ్లు. చివరి ఇద్దరూ కవల పిల్లలు. సురేష్‌ గోపి చిన్నతనమంతా కొల్లంలోనే గడిచింది. జువాలజీలో బ్యాచ్‌లర్ డిగ్రీ, ఇంగ్లిష్ లిటలేచర్లో మాస్టర్స్ చేశారాయన. ‘ఒడయిల్ నిన్ను’ అనే సినిమాతో 1965లో ఆరేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సురేష్ గోపి.... పెద్దయ్యాక నటించిన నిరముల్ల రావుకల్ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత చేసిన ‘టీపీ బాలగోపాలన్ ఎంఏ’ అనే మూవీతో సురేష్‌కి మంచి పేరు వచ్చింది. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో విలన్ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపించిన సురేష్ గోపి... ‘మను అంకుల్’ లాంటి కొన్ని సినిమాల్లోనూ అద్భుతమైన కామెడీని పండించి మార్కులు వేయించుకున్నారు.

పోలీస్ ఆఫీసర్ పాత్రలకు కేరాఫ్.. సురేష్ గోపి

 ఎనభై సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించిన తర్వాత సురేష్ గోపికి హీరోగా నటించే చాన్స్ వచ్చింది. 1992లో షాజీ కైలాస్ డైరెక్ట్ చేసిన ‘తలస్తానమ్’ అనే సినిమాతో లీడ్ యాక్టర్‌‌గానూ మారారు. ఆ నెక్స్ట్ ఇయర్ చేసిన ‘ఏకలవ్యన్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌ బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టింది. నూట యాభై రోజులు ఆడి సెన్సేషన్ సృష్టించింది. దాంతో మలయాళ సీమలో సురేష్ గోపి హవా మొదలయ్యింది.  దర్శకుడు షాజీ కైలాస్, రచయిత రెంజీ ప్యానికర్‌‌.. ఇద్దరూ కలిసి సురేష్‌ గోపిని పోలీసాఫీసర్ పాత్రలకి కేరాఫ్‌ చేశారు. ‘మాఫియా’ నుంచి మొదలుపెట్టి చాలా సినిమాల్లో యూనిఫామ్ వేశారాయన.  90'లో ఆయన పోలీస్ ఆఫీసర్‌‌గా నటించిన సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం పోలీసే కాదు.. ఎన్‌ఎస్‌జీ కమాండో, సీబీఐ ఆఫీసర్, ఆర్మీ మేజర్, రా ఆఫీసర్‌‌ లాంటి పాత్రలన్నీ సురేష్‌ గోపియే చేయాలి అన్నంత డిమాండ్ ఏర్పడింది. బయట కనబడినప్పుడు ఆయనను కొందరు నిజమైన పోలీస్ ఆఫీసర్‌‌ అనుకునేవారంటే... ఆయన చేసిన పోలీసు పాత్రలు ఎంత పాపులర్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు.

బహు భాషల్లో.. అతిథి పాత్రల్లో..

 సురేష్ గోపి సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యేవి. దాంతో ఇక్కడ కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు అల్లు అర్జున్ కి కేరళలో ఎలా అభిమానులు ఉన్నారో.. అప్పట్లో సురేష్‌ గోపికి తెలుగునాట అంతమంది అభిమానులు ఉండేవారు. ఆయన నేరుగా తెలుగులోనూ నటించారు. కృష్ణంరాజు లీడ్ రోల్లో నటించిన ‘అంతిమతీర్పు’లో ఓ కీలక పాత్ర పోషించారు. మలయాళ సినిమా ‘న్యూఢిల్లీ’కి ఇది రీమేక్. ఒరిజినల్‌లో తాను చేసిన పాత్రనే తెలుగులోనూ చేశారు సురేష్ గోపి. ఆ తర్వాత చాన్నాళ్లకు అజయ్ హీరోగా రూపొందిన ‘ఆ ఒక్కడు’ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. అంతే కాదు ఐదారు తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. కన్నడ, హిందీ చిత్రాల్లోనూ అతిథి పాత్రల్లో కనిపించారు.

 

అవార్డుల వెల్లువ

శోభనతో కలిసి సురేష్ గోపి నటించిన ‘మణిచిత్ర తాజు’ని ఇప్పటికీ బెస్ట్ మలయాళం మూవీగా చెబుతారు. మోహన్‌లాల్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా.. రజినీకాంత్ చేసిన ‘చంద్రముఖి’ చిత్రానికి మాతృక. ఒరిజినల్‌లో రజినీ పాత్రలో మోహన్‌లాల్, ప్రభు పాత్రలో సురేష్ గోపి నటించారు. ఇన్నేళ్ల లాంగ్ కెరీర్‌‌లో 250కి పైగా సినిమాల్లో సురేష్ గోపి నటించారు. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన... 1998లో ‘కలియాట్టం’ సినిమాకి గాను జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. అదే సినిమాకి కేరళ స్టేట్ అవార్డు కూడా వరించింది. ఇప్పటికీ అదే ప్యాషన్ తో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నట్టు సమాచారం. వేరే హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ పాత్రలు చేయడానికి కూడా ఆయన ఎస్ చెబుతున్నారు. శంకర్ తీసిన ‘ఐ’ సినిమాలోనూ విలన్‌గా నటించి మెప్పించారు సురేష్.  

మల్టీ టాలెంటెడ్ సురేష్ గోపి

ఆయనలో ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. చాలా సినిమాల్లో రైటర్స్ రాసినవాటికి తన సొంత పవర్ ప్యాక్డ్ పంచ్ లైన్స్ యాడ్ చేస్తుంటారు. యాక్షన్‌ సీన్స్ ని సొంతగా కంపోజ్ చేస్తారు. ఇక ఆయన చాలా మంచి సింగర్ కూడా. ఇప్పటి వరకు పదమూడు సినిమాల్లో పాటలు పాడారు. చాలా షోస్‌లో, ఈవెంట్లలోనూ తన గొంతు వినిపిస్తుంటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత చాలా ఈవెంట్స్ లో ఆయనకు నివాళిగా సురేష్ పాడిన పాటలకు అందరూ ఫిదా అయ్యారు. 

బుల్లితెరపైనా సత్తా చాటిన సురేష్ గోపి

బుల్లితెర పైనా సురేష్ గోపి తన ముద్ర వేశారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ మలయాళ వెర్షన్ కి ఆయనే హోస్ట్. 2012 నుంచి ఆయన ఈ షో చేస్తున్నారు. ఇంకా చాలా షోస్‌లో ఆయన భాగస్వామ్యం ఉంది. కొన్నింటికి హోస్ట్, కొన్నింటికి ప్రొడ్యూసర్, కొన్నింటికి గెస్ట్, కొన్నింటికి జడ్జ్.. ఇలా చాలా రకాలుగా ఆయన టెలివిజన్‌ ఫీల్డ్ లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. 

రాజకీయ ప్రస్థానం

స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు కనిపించేవి. ఎస్.ఎఫ్.ఐ స్టూడెంట్ యూనియన్‌లో పని చేశారాయన. అదే ఆ తర్వాత పాలిటిక్స్ వైపు వెళ్లేలా ప్రోత్సహించింది. 2006లో జరిగిన కేరళ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో సురేష్ చురుగ్గా పాల్గొన్నారు. 2016లో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అదే యేడు బీజేపీలో చేరారు. 2019 పార్టమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ తరపున త్రిసూర్‌‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కానీ 2021 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

కొడుకుతో స్క్రీన్ షేర్...

సురేష్ గోపిని అందరూ ఫ్యామిలీ మేన్ అంటారు. వర్క్ విషయంలో ఎంత సిన్సియర్ గా ఉంటారో, ఫ్యామిలీ విషయంలోనూ అదే నిబద్ధతతో ఉండటమే అందుకు కారణం. ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతోనే గడపడానికి ఇష్టపడతారాయన. 1990లో రాధికా నాయర్‌‌ని వివాహం చేసుకున్నారు సురేష్. ఓ ప్రముఖ మలయాళ నటికి మనవరాలు రాధిక. వీరికి ఐదుగురు పిల్లలు. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. పెద్ద కూతురు లక్ష్మి ఏడాదిన్నర వయసప్పుడే ఓ కార్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. పెద్ద కొడుకు గోకుల్ ఆల్రెడీ సినిమాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ‘పాప్పన్’ ఒకటి. ఇందులో సురేష్ గోపి తన కొడుకుతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండటం విశేషం.