తంగేడు పూలతో పేర్చి.. పసుపు గౌరమ్మతో అలంకరించి

 తంగేడు పూలతో పేర్చి.. పసుపు గౌరమ్మతో అలంకరించి

‘‘ఒక్కొక్క పువ్వేసి చందమామా... ఒక్క జాము గడిచె చందమామా..’’ అంటూ పసిడి తంగేడు పూలతో బతుకమ్మని పేర్చుకుని, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని మురిసిపోతరు తెలంగాణ ఆడబిడ్డలు. వానాకాలం ముగుస్తూ, చలికాలం మొదలవుతున్నప్పుడు చేసుకునే పూలపండుగ బతుకమ్మ. తెలంగాణ అంతా పచ్చని పొలాలు, నిండిన చెరువులు, పొంగుతున్న వాగులతో కళకళలాడుతున్న టైంలో చేసుకునే ఆడబిడ్డల పండుగ బతుకమ్మ. ప్రకృతి మురిసిపోయేట్టు.. రంగురంగుల పూలను నడుమ ఉంచి, కొత్త బట్టలు కట్టుకుని, చుట్టూ తిరుగుతూ ఆడుకునే రంగుల పండుగ బతుకమ్మ. గునుగు, తంగేడుల అందాలు, అగరబత్తుల పొగలు, వాయినాలు, ప్రసాదాల.. నడుమ చేసుకునే ఆడబిడ్డల పెద్ద పండుగ. వందల మంది ఒక్క దగ్గర చేరి చేసుకునే గొప్ప పండుగ. 

తెలంగాణలో మాత్రమే జరుపుకునే పండుగ‘బతుకమ్మ’. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెక్కడా పూలను పూజించే పండుగ కనిపించదు. మూడేళ ఆడపిల్ల నుంచి అరవయ్యేళ అమ్మమ్మ వరకు.. తొమ్మిది రోజుల పాటు పువ్వులను ఆటపాటలతో పూజించే పండుగ ఇది. మహాలయఅమావాస్యతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగే ఈ పండుగ వచ్చే ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులు ఏడాదంతా ఎదురుచూస్తారు. పెళ్లైన ఆడవాళ్లైతే పండుగకు ముందురోజే అత్తింటి నుంచి పుట్టింటి కి చేరుకుంటారు. బతుకమ్మ పండుగకు వారం ముందు నుంచే ఇళ్ళలో హడావిడి మొదలవుతుంది. మగ, ఆడా అందరూ ఈ పండుగలో భాగమే. పూలు, ఆకులు తేవడం మగవాళ్ల పనైతే.. పూలను అందంగా పేర్చి, బతుకమ్మలు ఆడడం ఆడవాళ్లకు సరదా. ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకుని బతుకమ్మ ఆడి, చెరువులో నిమజ్జనం చేస్తారు. 

ఓరుగల్లు సద్దుల బతుకమ్మ మస్తు ఫేమస్‍ 
తెలంగాణ అంటేనే బతుకమ్మ. అందులోనూ సద్దుల బతుకమ్మ అంటే ఇక ఆడబిడ్డలకు పెద్ద పండుగ. ఈ పండగకు ఓరుగల్లు చాలా ఫేమస్‍. గిరిజనుల ‘మేడారం సమ్మక్క సారక్క జాతర’ ఎలా ఉంటదో ఏటా వరంగల్‍ పద్మాక్షి గుట్ట వద్ద జరిగే సంప్రదాయ బతుకమ్మ, దసరా ఉత్సవాలు అలానే ఉంటాయి. పెత్రమాస నుంచి విజయదశమి వరకు ఏ కాలనీలో చూసినా గౌరమ్మ పాటలు.. దానికి అనుగుణంగా కోలాటాలే కనపడుతాయి. అమెరికా, ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద కొలువులు, జాబులు చేసేటోళ్లంతా ఈ పది రోజులు సొంతూళ్లకు వస్తారు. హైదరాబాద్‌లో ఉండేటోళ్లు కూడా నాలుగు రోజుల ముందే ఫ్యామిలీతో వాళ ఊళ్లళ్లకు రావడానికి ప్లాన్‍ చేసుకుంటారు. 

సద్దుల బతుకమ్మ అంటేనే.. పద్మాక్షి టెంపుల్‍


ఓరుగల్లులో సద్దుల బతుకమ్మ అంటే హన్మకొండ సిటీలోని పద్మాక్షి గుట్ట వద్ద జరిగే వేడుకలే గుర్తొస్తాయి. తీరొక్క పూల బతుకమ్మలతో ట్రైసిటీలోని వేలాదిమంది ఆడపడుచులు ఉత్సవాల్లో పాల్గొని బతుకమ్మ ఆడతారు. తెలంగాణ సంప్రదాయంగా రంగురంగుల చీరలతో వస్తారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రసాదంగా నువ్వుల పిండి, పల్లీల పిండి పంచిపెడతారు. పిల్లలకు సత్తిపిండి అంటే చాలా ఇష్టం. అందుకే వారం ముందే నాలుగైదు కిలోలు చేసి పెడతారు. ఆరోగ్యరీత్యా చిన్నారులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ‘తల్లీబిడ్డల’ బొమ్మలతో ఆకట్టుకునే పద్మాక్షి చెరువును చూడటానికి రెండు కళ్లు చాలవు. చుక్క నీరు కనపడకుండా మొత్తం రంగురంగుల బతుకమ్మలే కనిపిస్తూ... అందంగా ఉంటుంది.

భద్రకాళి, వెయ్యి స్తంభాల ఆలయాలు


సద్దుల బతుకమ్మకు పద్మాక్షి ఆలయం చుట్టపక్కల ఏరియాలతో పాటు వెయ్యి స్తంభాల గుడి కిక్కిరిసిపోతుంది. దసరా సందర్భంగా ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో గ్రాండ్‍గా చేస్తారు. అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు వివిధ దేవతామూర్తుల రూపంలో అలంకరిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై వెయ్యి స్తంభాల గుడిలో రుద్రేశ్వరదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిమలతో పురవీధుల్లో ఊరేగింపు చేస్తారు. 

జగిత్యాలలో రెండుసార్లు!
జగిత్యాల జిల్లాలో బతుకుమ్మ పండుగ రెండుసార్లు చేసుకుంటారు. ఆడబిడ్డలు అత్తారింట్లో, తల్లిగారింట్లో.. రెండు చోట్లా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రెండుసార్లు పండుగ చేయడం మొదలుపెట్టారు. జిల్లాలో ని సగం ఊళ్లలో దసరాకు ముందు పండుగ చేస్తారు. జిల్లాలోని జగిత్యాల, మల్యాల, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, వెల్గటూర్, బుగ్గారం మండలాల్లో దసరాకు ఒకరోజు ముందు బతుకమ్మ పండుగ చేస్తారు. దసరా తర్వాత జగిత్యాల జిల్లాలోని రాయికల్, మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో బతుకమ్మ పండుగ చేస్తారు.

సీతంపేట.. నేతకాని బతుకమ్మ


బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పూల పండుగ. రాష్ట్రమంతటా ఒకేసారి జరుగుతుంది. కానీ వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో మాత్రం ఏటా రెండుసార్లు బతుకమ్మ సంబరాల సందడి కనిపిస్తుంది. ఇక్కడి నేతకాని కుటుంబాలు దీపావళి పండుగ నుంచి మూడు రోజుల పాటు బతుకమ్మ సంబురాలు చేస్తుంటారు. గంగ స్నానాలు చేసి రేగడి మట్టితో జోడెడ్ల బొమ్మలు తయారు చేసే సంప్రదాయంతో మొదలయ్యే ఈ సంబురాలు బతుకమ్మ నిమజ్జనంతో ముగుస్తాయి. పంటలు సమృద్ధిగా పండటంతో పాటు జనం సుఖసంతోషాలతో ఉండాలని ఇలా సంప్రదాయబద్ధం గా ఉత్సవాలు చేస్తామని సీతంపేట ఊరివాళ్లు చెప్తున్నారు. ఏటా రెండుసార్లు సంబురాలు చేస్తుండడంతో స్పెషల్‌ ఈవెంట్‌గా చెప్తున్నారు సీతంపేట ఊరివాళ్లు.

మూడు తరాల ఉత్సవం
మహారాష్ట్రకుచెందిన కొన్ని నేతకాని కుటుంబాలు దాదాపు 150 ఏండ్ల కిందట సీతంపేటకు వలస వచ్చినట్లు చెప్తుంటారు. పిల్లాపాపలతో వచ్చిన ఆ కుటుంబాలు ఇక్కడే వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. నేతకానిల అక్కడి సంప్రదాయం ప్రకారం.. కేదారీశ్వరుడికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించడం ఇక్కడ కూడా మొదలుపెట్టారు. అలా అప్పటినుంచి ఇప్పటివరకు మూడు తరాల వాళ్లు అదే ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు ఊరివాళ్లు చెప్తున్నారు. అయితే అక్కడి నేతకానిలు పోలల అమావాస్య జరుపుకుంటారని, దీపావళికి గంగ నోముల పండుగ ఇక్కడ పుట్టిన ఆచారమేనని మరికొందరు అంటున్నారు. సంప్రదాయమేదైనా ఏటా బాగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలనే ఉద్దేశంతోనే ఈ నోము నోస్తారు.

రేగడి మట్టితో జోడెడ్ల బొమ్మలు

సీతంపేటకుచెందిన నేతకాని కులస్తులు వాళ్ల కులదైవమైన కేదారీశ్వరుడికి చేసే పూజల్లో భాగంగా మూడు రోజులు ఉత్సవాలు చేస్తారు. వీటినే గంగ నోములని కూడా పిలుస్తారు. ఇందులో దీపావళినాడు మొదటిరోజు సంప్రదాయం ప్రకారం గ్రామ సమీపంలోని గంగ(చెరువు)కు వెళ్తారు. అక్కడి నుంచి పవిత్రమైన రేగడి మట్టిని తీసుకొచ్చి జోడెడ్ల బొమ్మలు తయారుచేస్తారు. వాటిని తాము పండించిన ధాన్యంతో చేసిన పిండి వంటలతో అలంకరించి, పూజలు చేస్తారు. ఆ తర్వాత రెండో రోజు వాటిని కోలాట నృత్యాలతో పిల్లాపాపలతో ఊరేగింపుగా వెళ్లి, చెరువులో నిమజ్జనం చేస్తారు. మూడో రోజు నేతకాని కుటుంబాలకుచెందిన వాళ్లంతా బతుకమ్మలు పేర్చి సాయంత్రం ఆడి పాడతారు. ఆ తర్వాతి రోజు కేదారీశ్వరుడిని ఎత్తుకునే క్రతువుతో మూడు రోజుల ఉత్సవాలు ముగుస్తాయి. నిష్ఠతో పూజలు నేతకానిలు ఈ ఉత్సవాలు జరిపే మూడు రోజులు నిష్ఠతో పూజలు చేస్తారు. ఇండ్లను మామిడి ఆకు తోరణాలతో అలంకరిస్తారు. అప్పటివరకు ఎలా ఉన్నా దీపావళి మొదలైన మొదటి రోజు నుంచి మద్యం, మాంసాలకు దూరంగా ఉంటారు. ఇంటిల్లిపాదీ శుభ్రత పాటిస్తూ పూజలు చేస్తారు. మూడు రోజుల ఉత్సవం ముగిసిన తరువాత ఒక్కపొద్దు విడిచి సంబురాలు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ కులదైవం కేదారీశ్వరుడు కరుణించి కటాక్షిస్తాడని ఇక్కడి ప్రజల నమ్మకం.

దీపావళి వేళ.. బతుకమ్మ కళ


సాధారణంగా దీపావళి అంటే ఎవరికైనాగుర్తొచ్చేది. లక్ష్మీదేవి నోములు, దీపాల కాంతులు, టపాసుల చప్పుళ్లు, ఇంట్లోపిండి వంటలు. కానీ సీతంపేటలో మాత్రం దీపావళి సమీపిస్తుంటేనే తంగేడు, గునుగు పూల కళ కనిపిస్తుంది. నేతకాని కుటుంబాలు బతుకమ్మలు పేర్చడానికి పోటీ పడతారు. మూడు రోజుల పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక వాళ్లంతా బతుకమ్మలతో ఊరి చివరనున్న చెరువు వద్దకు వెళ్లి ఆడి, పాడతారు. ఇందులో ఆడ, మగ అని తేడా లేకుండా అంతా కలిసి బతుకమ్మ పాటలు పాడతారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం తాము పండించిన ధాన్యంతో తయారుచేసిన పిండి వంటకాలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలా సీతంపేట నేతకానీలు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బతుకమ్మ సంబరాలను దీపావళి వేళ చేసుకుంటారు.