2678 పాటలతో అలరించిన కిషోర్ కుమార్

2678 పాటలతో అలరించిన కిషోర్ కుమార్

ఆయన పాట.. కలత చెందిన హృదయానికి ఓదార్పునిచ్చింది. అమ్మ లాలి కన్నా కమ్మగా జోల పాడింది. ప్రియుని విరహ వేదనను వివరంగా చెప్పింది. స్నేహ మాధుర్యాన్ని మంద్రంగా వినిపించింది. వందల, వేల, కోట్ల శ్రోతల హృదయ సీమల్లో ప్రేమ మందిరాన్ని నిర్మించింది. ఇప్పటికీ ఆయన అక్కడ నివసిస్తూనే ఉన్నారు. తన పాటలనే మాటలుగా చేసి ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్నారు. ప్రపంచం మెచ్చిన ఆ గాయకుడు మరెవరో కాదు.. కింగ్ ఆఫ్ మెలొడీగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే  కిశోర్ కుమార్. ఓ గాయకుడు తన జీవితంలో ఎన్నో పాటలు పాడతాడు. కానీ పాడిన ప్రతి పాటనీ శ్రోతల గుండెల్లోకి తీసుకెళ్లిన ఘనత మాత్రం ఆయనకే దక్కింది. నేడు కిశోర్ కుమార్ జయంతి ఈ సందర్భంగా ఆయన తలపుల తోటల్లో, పాటల పూదోటల్లో ఒక్కసారి విహరిద్దాం.

పాటలకు యూత్ ఫిదా

టీజింగ్ సాంగ్స్ నుంచి డివోషనల్ వరకు అన్ని జానర్స్‌లో పాటలు పాడినా.. రొమాంటిక్ పాటలకి రారాజు ఎవరంటే వినిపించే పేరు కిశోర్ కుమార్‌‌. ఆయన పాటల్లో పొంగి పొర్లే ప్రేమకి యూత్‌ ఫిదా అయిపోయేవారు. పల్‌ పల్ దిల్‌కే పాస్, హమే తుమ్‌సే ప్యార్ కిత్‌నా, నీలే నీలే అంబర్ పే, యే షామ్ మస్తానీ, కబీ కబీ మేరే దిల్‌మే, దిల్‌ క్యా కరే జబ్‌ కిసీకో తదితర పాటలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో, ప్రతి ఈవెంట్‌లో మార్మోగుతుంటాయి. 

భారమైన మనసుకు ఓదార్పు

 

రొమాంటిక్ సాంగ్స్‌ ఎంత అద్భుతంగా పాడేవారో.. విషాద గీతాలను అంతకు మించి పాడేవారు కిశోర్ కుమార్. అలాంటి పాటలు పాడినప్పుడు ఆయన స్వరంలోనే ఏదో పెయిన్ ఉందనిపించేది. అందుకే అవి హృదయాలకు హత్తుకునేవి. ఓ సాథీరే తేరే బినాబీ క్యా జీనా, జిందగీ కే సఫర్‌‌మే, మేరే నైనా సావన్ భాదో, మేరే నసీబ్‌మే తేరా ప్యార్ నహీ తదితర పాటలు విని చలించిపోయిన శ్రోతలు ఉన్నారు. ఇప్పటికీ మనసు భారమైనప్పుడు ఎంతోమంది కిశోర్ కుమార్ పాటలు విని ఓదార్పు పొందుతారంటే అతిశయోక్తి కాదు.

110 మంది సంగీత దర్శకులతో పని

సింగర్‌‌గా కిశోర్‌‌ది తిరుగులేని రికార్డు. హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్‌పురి భాషల్లోనూ కిశోర్ కుమార్ పాటలు పాడారు. ఎన్నో భాషల్లో ప్రైవేట్ సాంగ్స్ పాడారు. బెంగాలీ ఆల్బమ్స్ కూడా చేశారు. 110 మంది సంగీత దర్శకులతో పని చేసిన రికార్డు ఆయన సొంతం. కెరీర్‌‌ మొత్తంలో 2678 పాటలు పాడారు. ఆయనతో కలిసి ఎక్కువ పాటలు పాడిన ఫిమేల్ సింగర్ ఆశా భోంస్లే. కిశోర్ పాడిన పాటల్లో ఎక్కువ నటించిన హీరో రాజేష్ ఖన్నా. మేల్ సింగర్ కేటగిరీలో కిశోర్ 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు . లతా మంగేష్కర్ అవార్డును తీసుకున్నారు. 

మల్టీ టాలెంటెడ్

కిశోర్ కేవలం సింగర్ కాదు. ఆయనో మల్టీ టాలెంటెడ్ పర్సన్. సింగర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, రైటర్, డైరెక్టర్ ఇలా ఎన్నో క్రాఫ్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించారు. అధికార్, చప్‌రే చాప్, న్యూఢిల్లీ, భాగమ్‌ భాగ్, మిస్ మాల, నౌకరీ లాంటి చాలా సినిమాల్లో నటించారు. ‘మిస్సమ్మ’ ఆధారంగా తీసిన ‘మిస్‌ మేరీ’లోనూ నటించారు. తెలుగులో ఏఎన్నార్ పాత్రను హిందీలో కిశోర్ పోషించారు. 

విమర్శలు, వివాదాలు

సింగర్‌‌గా కిశోర్ ఎంత లైమ్‌లైట్‌లో ఉండేవారో.. వివాదాలతోనూ వార్తల్లోనూ నిలిచేవారు. మొదటి భార్య రుమా ఉండగానే హీరోయిన్ మధుబాలకు దగ్గరయ్యారు. రుమాతో విడాకులు తీసుకుని ఆమెని పెళ్లి చేసుకున్నారు. మతం కూడా మార్చుకుని కరీమ్ అబ్దుల్ అయ్యారు. మధుబాల అనారోగ్యంతో చనిపోయాక యోగితా బాలిని పెళ్లాడారు. ఆమెతో విడిపోయిన కొన్నాళ్లకే నీలా చందావర్కర్‌‌ని వివాహం చేసుకున్నారు. ప్రేమ కోసం పరితపించానని ఆయన చెప్పుకున్నా.. అలాంటి వ్యక్తికి ఉండాల్సిన వ్యక్తిత్వం ఇది కాదంటూ చాలామంది ఆయన్ని విమర్శించారు. కెరీర్ పరంగానూ కొన్ని విమర్శలు, వివాదాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ టైమ్‌లో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి కిశోర్ నో చెప్పారు. దీంతో ఎమర్జెన్సీ ఎత్తేసే వరకు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ ఆయన పాటల్ని బ్యాన్ చేసింది. ఇన్‌కం ట్యాక్స్ దాడులు కూడా కిశోర్‌‌ని వివాదాల పాలు చేశాయి. కొందరు హీరోలతో గొడవ పడటం, వారికి పాడనని మొరాయించడం ఆయన్ని ఇబ్బందుల్లో పెట్టాయి. అయినా చెక్కు చెదరని కిశోర్ తానేంటో తనకి తెలుసని అనేవారు. 

సగం మేకప్తో షూటింగ్కు

కిశోర్‌‌కి కోపం ఎక్కువని చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో చాలా మొండిగా ఉండేవారట. ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా విసిగిస్తే వాళ్లని తనదైన స్టైల్లో ఇబ్బంది పెట్టేవారట. ఓసారి ఒక షూటింగ్‌కి సగం మేకప్‌తో రాగా..  అదేంటని అడిగితే సగం డబ్బులే ఇచ్చారు మరి అన్నారట. మొత్తం ఇస్తే ఫుల్ మేకప్‌తో వస్తానని చెప్పారట. అయితే ఎవరైనా నిజంగా సమస్యల్లో ఉండి డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఒక్క పైసా తీసుకునేవారు కాదట. ఎవరికీ తెలియకుండా ఎంతోమందికి సాయం కూడా చేశారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కిశోర్ మొండితనం గురించి కూడా ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటారు. తనను ఇబ్బంది పెట్టేవారిపై వెరైటీగా రివేంజ్ తీర్చుకోవడం ఆయనకి చాలా ఇష్టమట. ఓసారి ఆయన మీద ఓ నిర్మాత కేసు పెట్టాడు. డైరెక్టర్ చెప్పిన మాట వినడం లేదని, దానివల్ల తమకి చాలా ఇబ్బందిగా ఉందని ఆరోపించాడు. ఆ తర్వాత షూటింగ్‌కి మౌనంగా వెళ్లారు కిశోర్. ఓ కార్‌‌ సీన్‌ కోసం కారెక్కారు. అయితే ముంబైలో స్టార్ట్ చేసి ఖండాలా వరకు వెళ్లిపోయారు. ఎందుకలా చేశావని తర్వాత నిర్మాత అడిగితే.. ‘డైరెక్టర్ చెప్పిందే కదా చేయాలి, ఆయన కట్ చెప్పలేదు, అందుకే నేను ఆగలేదు’ అన్నారట.

కిశోర్ ఈజ్ కిషోర్

కిశోర్‌‌ పాటల్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో, ఆయన వ్యక్విత్వంలోనూ అన్ని షేడ్స్ కనిపిస్తాయి. ఎవరు కామెంట్ చేసినా, ఎవరు విమర్శించినా, ఎవరు కష్టపెట్టినా, ఎవరు ఇబ్బందికి గురి చేసినా.. కిశోర్ ఈజ్ కిశోర్. ఆయన ఆయనలా ఉన్నారు. ప్రేమిస్తే తిరిగి ప్రేమించారు. ద్వేషిస్తూ దూరంగా వెళ్లిపోయారు. ఏది ఏమైనా తన ఉనికిని ప్రతిక్షణం ప్రపంచానికి చాటారు. అయితే 1987, అక్టోబర్ 13న.. దీపావళి కాంతులతో దేశమంతా వెలుగుతున్న క్షణాన.. అందరినీ వదిలేసి కిశోర్ అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఆరోజు ఆయన గుండె ఆగిందేమో కానీ.. ఆయన పాట మాత్రం ఆగలేదు. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.