మందుబాబులకు అడ్డాగా ఆక్సీజన్ పార్కు

మందుబాబులకు అడ్డాగా ఆక్సీజన్ పార్కు

వరంగల్ నగరంలో కోట్ల రూపాయలతో ఆర్భాటంగా చేపట్టిన ఆక్సీజన్ పార్కు పనులు మధ్యలోనే ఆగిపోయాయి. మూడేళ్ల కిందట చుట్టూ ప్రహరీ నిర్మాణం చేసి.. పార్కు పనులు గాలికి వదిలేశారు. దీంతో ఆక్సిజన్ పార్కు మందుబాబులకు అడ్డాగా మారింది. 

వరంగల్ సిటీలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. కాలుష్యాన్ని నివారించేందుకు రాంపూర్ దగ్గర 2019 సంవత్సరంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆక్సీజన్ పార్కుకు శంకుస్థాపన చేశారు. వాకింగ్ ట్రాక్, ఉద్యానవనంతో ఆహ్లాదపరిచే వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ 4 ఎకరాల భూమి, 4 కోట్లు రూపాయలు మంజూరు చేసింది.

పార్కు స్థలం చుట్టూ మొక్కలు పెట్టడానికి గుంతలు తీసి, నామమాత్రంగా అక్కడక్కడా చెట్లు పెట్టి, కొన్ని చోట్ల నాటకుండా వదిలేశారు. పార్కు పనులు ఇప్పటివరకు పూర్తికాకపోవడంతో అధ్వానంగా కనిపిస్తోంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై మూడు చోట్ల ఆర్చీలకు శంకుస్థాపన బోర్డులే కనిపిస్తున్నాయి. ఆక్సిజన్ పార్కును సూచించే బోర్డును ఏర్పాటు చేయలేదు అధికారులు. దీంతో ప్రజా ప్రతినిధుల పని తీరుపై విమర్శలు వస్తున్నాయి.

రాత్రి, పగలు తేడా లేకుండా కొందరు యువకులు మందుతాగడానికి పార్కు అడ్డాగా మారింది. ఆక్సీజన్ పార్కులో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అడవిలా మారింది. చెరువు శిఖంలోనూ మొక్కలు నాటి వదిలేశారు. పార్కు పనులు ప్రారంభించి.. ఉపయోగం లోకి తీసుకురావాలని స్థానికులు అంటున్నారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిదులు పార్కు అభివృద్ధిపై దృష్టి పెట్టాలంటున్నారు జనం. ఆగిన పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.